
Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. 380పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.., నిఫ్టీ @22,450
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
వృద్ధిని పెంపొందించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినప్పటికీ, భవిష్యత్‌లో మరిన్ని కోతలు వచ్చే అవకాశాలపై సంకేతాలు ఇచ్చినప్పటికీ, మార్కెట్లపై ఈ నిర్ణయాల ప్రభావం కనిపించలేదు.
అమెరికా విధించిన సుంకాల కారణంగా ఏర్పడిన వాణిజ్య యుద్ధ భయాలు, ఆర్థిక వృద్ధిపై వీటి ప్రభావం వల్ల ఏర్పడే మందగమన ఆందోళనలు మార్కెట్లను ప్రభావితం చేశాయి.
దీంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటుగా భారత మార్కెట్లు కూడా నష్టాల్లోనే కొనసాగాయి.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా అదే దారిని అనుసరించాయి. నిఫ్టీలో ఐటీ, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియల్టీ, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన సూచీలు ప్రధానంగా నష్టపోయాయి.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 60 డాలర్లు
సెన్సెక్స్ రోజు 74,103.83 పాయింట్ల వద్ద ప్రారంభమై(గత ముగింపు స్థాయి 74,227.08) తొలి నుంచే నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి.
కొన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ,రోజు మొత్తం నష్టాల్లోనే కొనసాగి,చివరికి 379.93 పాయింట్లు నష్టపోయి 73,847.15 వద్ద ముగిసింది.
నిఫ్టీ కూడా 136.70 పాయింట్ల నష్టంతో 22,399 వద్ద స్థిరపడింది.రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 86.69గా నమోదైంది.
సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా,ఎల్‌అండ్‌టీ,టాటా స్టీల్, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి.
నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్,టైటాన్,పవర్‌గ్రిడ్ కార్పొరేషన్,అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్ దృష్ట్యా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 60 డాలర్లకు చేరింది. బంగారం ధర ఔన్సుకు 3063 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.