
Stock Market Today: అమెరికా సుంకాలు అమల్లోకి వచ్చిన వేళ .. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం భారత్ నుంచి దిగుమతి అయ్యే కొన్ని వస్తువులపై 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఉదయం 9:34 గంటల సమయంలో సెన్సెక్స్ 977 పాయింట్లు క్షీణించి, 80,110 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగించింది. నిఫ్టీ సూచీ కూడా 200 పాయింట్లు నష్టపోయి 24,511 వద్ద ఉంది. అలాగే, డాలర్‌కి పూర్వకంగా రూపాయి మారకం విలువ 87.50 వద్ద స్థిరంగా ఉంది.
వివరాలు
ఏ షేర్లు ఎలా..?
నిఫ్టీ సూచీలో కొన్ని కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో హీరో మోటార్‌కార్ప్, ఆసియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, మారుతీ సుజుకీ, టైటాన్ వంటి ప్రముఖ స్టాక్స్ లాభాలను నమోదు చేస్తున్నాయి. అయితే, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జియో ఫైనాన్షియల్, టీసీఎస్ వంటి కంపెనీ షేర్లు నష్టపోతూ ఉన్నాయి.
వివరాలు
వాణిజ్య రంగంపై ప్రభావం
భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు వ్యాపార రంగంలో తీవ్ర ఆందోళనను సృష్టించాయి. ఈ విధానం దేశంలోని ముఖ్య ఎగుమతి రంగాలను ప్రభావితం చేసి, దేశవ్యాప్తంగా లక్షలాది కార్మికుల జీవనోపాధులను కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా జౌళి, తోలు, ముత్యాలు, ఆభరణాల వంటి రంగాలపై ఈ విధానం తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, వ్యాపార సంఘాలు ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ ద్వారా తెలియజేశారు.