Cigarette Prices: పొగాకు వినియోగదారులకు షాక్.. ధరలు మరింత పెరిగే అవకాశం!
జీఎస్టీ పన్ను హేతుబద్దీకరణలో భాగంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, శీతలపానీయాలు ధరలు త్వరలో మరింత పెరగనున్నాయి. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీ అధ్యక్షతన సోమవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ జీవితకాల అర్హత కమిటీ (జీవోఎం) సమావేశంలో కీలక సిఫార్సులు చేశారు. పొగాకు ఉత్పత్తులు, శీతలపానీయాలపై ప్రస్తుతం 28శాతం జీఎస్టీ రేటును ఉండగా, దాన్ని 35శాతానికి పెంచాలని జీవోఎం సూచించింది. అదే విధంగా రెడీమేడ్ గార్మెంట్స్‌పై మార్పులు చేశారు. రూ.1,500 లోపు గార్మెంట్స్ 5శాతం పన్ను, రూ.1,500 నుంచి రూ.10,000 ఉంటే 18శాతం పన్ను రూ.10,000కు పైబడిన గార్మెంట్స్‌పై 28శాతం పన్ను విధించారు.
లగ్జరీ ఉత్పత్తులపై అదనపు భారం
జీవోఎం నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఉన్న 5శాతం, 12శాతం, 18శాతం, 28శాతం స్లాబ్‌లకు 35శాతం కొత్త స్లాబ్‌ను జతచేయాలని ప్రతిపాదించారు. ఈ స్లాబ్‌లో లగ్జరీ ఉత్పత్తులతో పాటు, పొగాకు ఉత్పత్తులు, శీతలపానీయాలను చేర్చనున్నారు. జీవోఎం ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల 21న సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రతిపాదనల వల్ల పొగాకు, శీతలపానీయాల ధరల పెరుగుదలతో పాటు, రెడీమేడ్ దుస్తుల వినియోగదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది.