silver price: దీపావళికి వెండి ధరలు ₹1.2 లక్షలకు చేరుకునే అవకాశం.. నిపుణులేం అంటున్నారు?
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో, గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతాల్లో రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీనితో డాలర్ విలువ తగ్గుతోంది, అదే సమయంలో బంగారం డిమాండ్ కూడా పెరిగి, రేట్లు ఎగబాకుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఈ తరుణంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
గత 12 సంవత్సరాల కాలంలో ఇదే అత్యధికం
ఇటీవల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించింది, దీనితో గోల్డ్ రేటు మరింత పెరగడం ప్రారంభమైంది. ఇంతకుముందు రోజు కంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రేట్లు తగ్గినా, ఇది గత 12 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2733 డాలర్ల వద్ద ఉంది, అలాగే స్పాట్ సిల్వర్ 34.20 డాలర్ల వద్ద ఉంది. గత 12 సంవత్సరాల కాలంలో ఇదే అత్యధికం. దేశీయంగా కూడా సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే వెండి రూ. లక్ష మార్కును దాటగా, దీపావళి, ధన్‌తేరాస్ పండగల నేపథ్యంలో ఈ రేటు ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
11 శాతం పెరిగిన వెండి ధరలు
ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి రేటు రూ. 2 వేలు తగ్గి రూ. 1.10 లక్షలకు చేరుకుంది. దీపావళి నాటికి ఇది రూ. 1.20 లక్షలకు చేరే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండస్ట్రియల్ డిమాండ్, రాజకీయ ఉద్రిక్తతలు, పండగ సీజన్ డిమాండ్, రానున్న అమెరికా ఎన్నికలు వంటి అంశాలు సిల్వర్ రేట్లు పెరగడానికి దోహదం చేస్తున్నాయని చెబుతున్నారు. ఈ నెలలోనే వెండి ధరలు 11 శాతం పెరిగాయి, ఇది 2024 మే తర్వాత నెల గరిష్టం. ఈ సంవత్సరం ఇప్పటివరకు సిల్వర్ రేట్లు 46 శాతం పెరగడం గమనార్హం. ఇండస్ట్రీలలో,ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్,సోలార్ ప్యానెల్స్,బ్యాటరీలు,సెమీ కండక్టర్లు వంటి వాటిలో వెండి వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల,పరిశ్రమల డిమాండ్ పెరిగితే,వెండి రేట్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.