
Silver price: బంగారానికి పోటీగా వెండి.. ధరలు ఆకాశాన్ని తాకనున్నాయా?
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధర పరుగులు పెడుతోంది. అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్‌తో దేశీయంగా రికార్డు స్థాయిలో పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.92 వేల మార్కును దాటింది.
దీనితో వినియోగదారులు కొనుగోళ్లకు వెనకడుగు వేస్తున్నారు. అయితే బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.
గడచిన ఏడాదిలో బంగారం,వెండి ధరలు 37 శాతం మేర పెరిగాయి. గడిచిన నెలలో బంగారం 6.70 శాతం పెరుగగా, వెండి 8.80 శాతం మేర ఎగబాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బంగారం ఔన్సు ధర 3,100 డాలర్లకు పైగా ట్రేడవుతోంది.
వెండి ఔన్సు ధర 34 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దేశీయంగా వెండి కిలో రూ.1.03 లక్షలు పలుకుతోంది.
Details
పెరుగుతున్న వెండి ధరలు
గతేడాది మే నెలలో వెండి ఔన్సు ధర 32 డాలర్లు ఉండగా, అక్టోబర్ నాటికి 34 డాలర్లకు పెరిగింది. దీపావళి నాటికి వెండి దేశీయంగా రూ.లక్ష మార్కును దాటింది.
అయితే డిసెంబర్ నాటికి వెండి ఔన్సు ధర 28 డాలర్లకు తగ్గింది.
అక్కడి నుంచి మళ్లీ 20 శాతం పెరిగి 34.45 డాలర్లకు చేరుకుంది. 2020లో 16 డాలర్ల వద్ద ఉన్న వెండి, గత ఐదేళ్లలో 19.4 శాతం CAGRతో దూసుకెళుతోంది.
Details
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న భౌగోళిక అనిశ్చితి, ట్రంప్ మూలంగా పెరిగిన వాణిజ్య యుద్ధ భయాలు పసిడి, వెండిపై డిమాండ్‌ను పెంచుతున్నాయి.
వెండిని పారిశ్రామిక అవసరాలకు ఎక్కువగా వినియోగించడం వల్ల డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా EV (ఇలక్ట్రిక్ వెహికల్), సోలార్ పరిశ్రమల నుంచి వెండికి భారీగా డిమాండ్ ఉంది.
వెండి డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడం మరో కారణం. 2025 నాటికి 1.20 బిలియన్ ఔన్సుల వెండి అవసరమవుతుందని అంచనా. కానీ సరఫరా మాత్రం 1.05 బిలియన్ ఔన్సులకే పరిమితమవుతుందని నిపుణులు అంటున్నారు.
1980ల నుంచి బంగారం, వెండికి ఉన్న నిష్పత్తి 70:1గా ఉంది. కానీ ప్రస్తుత ధరల ప్రకారం 90:1గా ఉంది. దీంతో వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు అంటున్నారు.