
UPI ATM: భారతదేశంలో తొలి UPI ATM.. స్కాన్ చేస్తే చాలు..నగదు లావాదేవీ సులభం!
ఈ వార్తాకథనం ఏంటి
స్లైస్ బ్యాంక్ భారతదేశంలో తొలిసారిగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత ATMను ప్రవేశపెట్టింది. జూలై 1న బెంగళూరులోని కోరమంగళలో ఈ ప్రత్యేక ATMతో కూడిన బ్యాంక్ బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఇది భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఓ విప్లవాత్మక ముందడుగుగా నిలిచింది. UPI విధానాన్ని సంప్రదాయ బ్యాంకింగ్ సేవలతో అనుసంధానించడం ద్వారా, ఇకపై కార్డుల అవసరం లేకుండా నగదు తీసుకోవడం, జమ చేయడం మరింత సులభంగా మారింది.
వివరాలు
1. ఇక కార్డు అవసరం లేదు - ఫోన్‌తోనే డబ్బు డ్రా, డిపాజిట్
స్లైస్ ప్రవేశపెట్టిన UPI ATM ద్వారా, ఫోన్‌పే, గూగుల్ పే, BHIM వంటి యాప్‌లను ఉపయోగించి QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా డబ్బును డ్రా చేయడం లేదా జమ చేయడం చేయవచ్చు. దీనికి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అవసరం లేదు. ATM స్క్రీన్‌లో "UPI QR క్యాష్" అనే ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత అవసరమైన మొత్తాన్ని నమోదు చేసి, చూపిన QR కోడ్‌ను మీ UPI యాప్‌తో స్కాన్ చేసి, మీ పర్సనల్ UPI పిన్‌ను ఎంటర్ చేస్తే డబ్బు తీసుకోవచ్చు లేదా జమ చేయవచ్చు.
వివరాలు
2. ప్రత్యేకమైన UPI ఆధారిత బ్యాంక్ బ్రాంచ్
బెంగళూరులోని కోరమంగళలో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ దేశంలోనే తొలి UPI ఆధారిత బ్యాంక్ బ్రాంచ్‌గా గుర్తింపు పొందింది. ఇది తక్షణ ఖాతా ప్రారంభం, కియోస్క్ ఆధారిత సేవలు వంటి సదుపాయాలను అందించడంతో పాటు, కస్టమర్లకు UPI ఆధారంగా సులభమైన లావాదేవీల అవకాశాన్ని కల్పిస్తుంది. ఖాతా ఓపెన్ చేయడం, నగదు జమ చేయడం, డ్రా చేసుకోవడం వంటి అన్ని బ్యాంకింగ్ సేవలకూ UPI ఆధారిత పద్ధతిలో వీలుకల్పిస్తుంది.
వివరాలు
3. స్లైస్ సూపర్ కార్డ్ - వడ్డీ లేని ఫీచర్లతో
స్లైస్ సూపర్ కార్డ్ అనే ఈ క్రెడిట్ కార్డ్, UPI ఆధారితంగా పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే - ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదా వార్షిక ఫీజు అవసరం లేదు. UPI యాప్ లేదా QR కోడ్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఈ కార్డుతో చేసే అన్ని కొనుగోళ్లపై గరిష్ఠంగా 3 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా, "స్లైస్ ఇన్ 3" ఫీచర్‌తో మీ ఖర్చులను వడ్డీ లేకుండా మూడు ఇన్‌స్టాల్‌మెంట్‌లుగా చెల్లించే సౌలభ్యం కూడా ఉంటుంది.
వివరాలు
4. దేశవ్యాప్తంగా విస్తరణ లక్ష్యం
ఈ UPI ATM సేవలు దేశంలోని ఏ బ్యాంక్ కస్టమర్ అయినా, UPI యాప్ ఉపయోగిస్తున్నవారు ఎవరైనా వినియోగించవచ్చు. స్లైస్ సంస్థ ఈ సేవలను దేశవ్యాప్తంగా 600 జిల్లాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ విధంగా, స్లైస్ బ్యాంక్ ప్రవేశపెట్టిన ఈ UPI ATMలు భారత బ్యాంకింగ్ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టు చెప్పవచ్చు. ఇకపై నగదు తీసుకోవడం, డిపాజిట్ చేయడం మరింత సులభం - అది జస్ట్ స్కాన్‌తోనే!