Page Loader
SpiceJet: QIP ద్వారా రూ. 3,000 కోట్లను సేకరించిన స్పైస్‌జెట్.. మూడు నెలల వేతన బకాయిలు చెల్లింపు
QIP ద్వారా రూ. 3,000 కోట్లను సేకరించిన స్పైస్‌జెట్.. మూడు నెలల వేతన బకాయిలు చెల్లింపు

SpiceJet: QIP ద్వారా రూ. 3,000 కోట్లను సేకరించిన స్పైస్‌జెట్.. మూడు నెలల వేతన బకాయిలు చెల్లింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2024
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్ గురువారం తన ఉద్యోగుల వేతన బకాయిలను చెల్లించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 16 నుంచి 18 వరకు కంపెనీ క్యూఐపీ (క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌) ద్వారా నిధులు సేకరించి, సుమారు రూ.3,000 కోట్లను సమీకరించింది. గతంలో, జూన్ నెల నుండి సంస్థ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదన్న వార్తలు వచ్చాయి. అదనంగా, ఏప్రిల్ 2020-ఆగస్టు 2023 మధ్య ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.220 కోట్ల టీడీఎస్ (మూలం వద్ద పన్ను మినహాయింపు)ను కూడా చెల్లించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వార్తలు వెలువడిన కొద్దిరోజులకే కంపెనీ క్యూఐపీ ద్వారా నిధులు సేకరించాలని నిర్ణయించుకుంది.

వివరాలు 

క్యూఐపీని దాదాపు 87 దేశీయ, అంతర్జాతీయ సంస్థలు సబ్‌స్క్రయిబ్ చేశాయి

ఫలితంగా, క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లు (క్యూఐబీ) నుంచి రూ.3,000 కోట్లను సమీకరించింది. ఇందులో కొంత భాగాన్ని ఉద్యోగుల వేతన బకాయిలు, టీడీఎస్ చెల్లింపులకు వినియోగించినట్లు అధికారులు తెలిపారు. స్పైస్‌జెట్ ప్రకటించిన క్యూఐపీని దాదాపు 87 దేశీయ, అంతర్జాతీయ సంస్థలు సబ్‌స్క్రయిబ్ చేశాయి. డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) గణాంకాల ప్రకారం, స్పైస్‌జెట్ మార్కెట్ వాటా క్రమంగా తగ్గిపోతోంది. జనవరి నెలలో ఇది 5.6 శాతం ఉండగా, ఆగస్టులో 2.3 శాతానికి చేరింది. 2021లో ఈ వాటా 10.5 శాతం కాగా, సంస్థ పరిధిలోని విమానాల సంఖ్య 2019లో 74 ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 28కి తగ్గింది.