Wipro New CEO and MD: విప్రోకు కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా
బెంగళూరుకు చెందిన ఐటి దిగ్గజం శ్రీనివాస్ పల్లియాను తమ సంస్థకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా నియమిస్తున్నట్లు విప్రో సంస్థ వెల్లడించింది. తక్షణమే ఆయన ఎండీ, సీఈఓ బాధ్యతలను స్వీకరిస్తారని శనివారం ఓ ప్రకటనలతో పేర్కొంది. అంతకు ముందు విప్రోకు సీఈవో, ఎండీగా పనిచేసిన థియరీ డెలాపోర్టే ఆ బాధ్యతల నుంచి వైదొలగడంతో సంస్థకు కొత్త సీఈఓ అండ్ ఎండీని నియమించినట్లు విప్రో వెల్లడించింది. థియరీ డెలాపోర్టే నాలుగేళ్లలో సంస్థ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారని ఆ ప్రకటనలో తెలిపింది. థియరీ డెలాపోర్టే తన అభిరుచులను కొనసాగించేందుకే ఆయన బాధ్యతలనుంచి వైదొలిగినట్లు విప్రో సంస్థ వివరణ ఇచ్చింది. కొత్తగా నియమితులైన శ్రీనివాస్ పల్లియా విప్రోలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన అనుభవం ఉంది.
ఎగ్జిక్యూటివ్ బోర్డులో పనిచేస్తున్నశ్రీనివాస్
ఇప్పటివరకు విప్రో ఎగ్జిక్యూటివ్ బోర్డులో పనిచేస్తున్నశ్రీనివాస్ పల్లియా ఇటీవలే ఆయన అమెరికాస్ 1 సంస్థకు సీఈఓ గా కూడా పనిచేశారు. ఆ సంస్థ విస్తరణకు, అభివృద్ధికి, అధిక మార్కెట్ వాటాలకు ఎంతగానో కృషి చేశారు. 1992లో విప్రో సంస్థలో చేరిన పల్లియా విప్రోలో ప్రొడక్ట్ మేనేజర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. విప్రోలో కన్స్యూమర్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్, బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్‌తో సహా అనేక పదవులను నిర్వహించారు. శ్రీనివాస్ పల్లియా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ పూర్తి చేశారు. ఇంకా మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలో అడ్వాన్స్డ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో గ్లోబల్ లీడర్‌షిప్, స్ట్రాటజీ మేనేజ్‌మెంట్‌లో కోర్సులు పూర్తి చేశారు.