NPS Vatsalya : 'ఎన్‌పీఎస్ వాత్సల్య' ప్రారంభం.. అర్హతలు, ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోండి!
ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం సెప్టెంబర్ 18న దిల్లీలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మైనర్ పిల్లల కోసం తల్లిదండ్రులు ఖాతాలు తెరచి, వారి రిటైర్మెంట్ అవసరాలకు ముందుగానే పొదుపు చేయడం ప్రారంభించవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది మైనర్ పిల్లల భవిష్యత్ రిటైర్మెంట్‌కు ఆర్థిక భద్రత కల్పించే గొప్ప పథకమని కొనియాడారు. ప్రస్తుతం ఈ పథకంతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం
ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం లక్ష్యాలు
తల్లిదండ్రులు లేదా సంరక్షకులు, భారతీయ పౌరులు, NRIలు ఈ పథకం ద్వారా పిల్లలకు ఖాతా తెరచి, ముందుగానే రిటైర్మెంట్ పొదుపు చేయవచ్చు. మైనర్ పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత, వారి కోరిక మేరకు ఈ ఖాతా సాధారణ NPS ఖాతాగా మారుతుంది. సెక్షన్ 80CCD(1B) కింద రూ.50,000 వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. ఇది సెక్షన్ 80C కింద ఉన్న రూ. 1.5 లక్షల మినహాయింపుకు అదనంగా ఉంటుంది. తల్లిదండ్రులు సంవత్సరానికి కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు.
ఎన్‌పీఎస్ వాత్సల్య ప్రయోజనాలు
పిల్లల కోసం చిన్న వయసులోనే పొదుపు ప్రారంభించడం ద్వారా, సమ్మేళన వడ్డీ ప్రభావంతో పెద్ద మొత్తంలో రాబడులు పొందచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత కూడా పొదుపు కొనసాగించడం ద్వారా పిల్లలకు భవిష్యత్ రిటైర్మెంట్ అవసరాలకు పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులో ఉంటాయి. పెట్టుబడి పై పన్ను మినహాయింపు లభించడం వల్ల తల్లిదండ్రులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. చిన్న వయసులోనే పొదుపు ఆవశ్యకతను అర్థం చేసుకోవడంలో పిల్లలకు ఇది సాయపడుతుంది.
మైనర్‌కు 18 ఏళ్లు నిండిన తర్వాత
18 ఏళ్లు వచ్చిన తర్వాత, ఈ ఖాతాను సాధారణ NPS ఖాతాగా మార్పు చేయవచ్చు. చిన్న వయసులో పెట్టుబడి ప్రారంభించడం వల్ల వారి రిటైర్మెంట్ ఫండ్‌లో పెద్ద మొత్తంలో డబ్బు సులభంగా జమ అవుతుంది. మూడు సంవత్సరాల తర్వాత ఖాతా ప్రారంభించడానికి పాక్షిక ఉపసంహరణకు అనుమతిచ్చారు. వయసు వచ్చిన తర్వాత పిల్లలు ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకం దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్పీఎస్ వాత్సల్య కార్యక్రమాలను నిర్వహించనున్నారు.