ఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్
ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి పండుగ అని గ్రేటర్ నోయిడాలో వరల్డ్ స్టార్టప్ కన్వెన్షన్ కి చాలా మంది ప్రజా ప్రముఖులు వస్తున్నారని ప్రచారం చేశారు. ప్రపంచ స్టార్టప్ కన్వెన్షన్‌ను పెట్టుబడిదారులు ల్యూక్ తల్వార్, అర్జున్ చౌదరి వర్ధమాన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలోని పెద్దలతో కనెక్ట్ అయ్యేందుకు వేదికను అందించారు. ఇది ఈ సంవత్సరం మార్చి 24న గ్రేటర్ నోయిడాలో జరిగింది. స్టార్టప్‌లు పెట్టుబడిదారుల నుండి నిధులు పొందడంలో సహాయపడటానికి ఈ ఈవెంట్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎలోన్ మస్క్, సుందర్ పిచాయ్, గౌతమ్ అదానీ వస్తున్నారంటూ నిర్వాహకులు ప్రచారం చేశారు. అధికారిక వెబ్‌సైట్ హోమ్‌పేజీలో కూడా పేర్కొన్నారు. అయితే, స్టార్టప్‌లు కన్వెన్షన్‌కు చేరుకున్నప్పుడు, ఒక్క అతిథి కూడా హాజరుకాకపోవడంతో అది స్కామ్ అని తేలింది.
రచయిత చేతన్ భగత్ తన వ్యక్తిగత సోషల్ మీడియా పేజీలో ఈ సమావేశాన్ని ప్రచారం చేశారు
ఈ ఈవెంట్ కు టిక్కెట్ ధర ఒక్కొకరికి రూ.8,000 వసూలు చేశారు. వారిలో కొందరు నిధులు పొందాలనే ఆశతో సమావేశానికి హాజరు కావడానికి వేల కిలోమీటర్ల(చెన్నై, నాసిక్, సూరత్) నుండి వచ్చారు. 2,000 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఇందులో పాల్గొన్నాయి. నిర్వాహకులు తమ వెబ్‌సైట్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చిత్రాలను పెట్టారు. అంతే కాదు, రచయిత చేతన్ భగత్ , అంకుర్ వారికూ, MBA చాయ్‌వాలా, రాజ్ షమానీతో సహా చాలా మంది ఈవెంట్‌ను ప్రచారం చేశారు. వేలాది మంది ప్రజలను మోసం చేయడంతో పాటు, సదస్సులో ఏర్పాటు చేసిన కార్యక్రమాల నాణ్యత నాసిరకంగా ఉండటంతో గందరగోళం చెలరేగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.