
Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు కాస్త స్థిరంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించినా, దేశీయ సూచీలు ప్రారంభంలో మాత్రం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. అయితే, కొద్దిసేపటికి స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9:25 గంటల సమయానికి సెన్సెక్స్ 138 పాయింట్లు పెరిగి 82,171 స్థాయిలో, నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 24,973 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, టీసీఎస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో కనిపిస్తున్నాయి.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 65.49 డాలర్లు
మరోవైపు, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎంఅండ్‌ఎం, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే,బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 65.49 డాలర్ల వద్ద ఉంది. బంగారం ధర ఔన్సు వద్ద 3,216 డాలర్లుగా నమోదైంది. గత ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా పెద్దగా మారకుండానే ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.09 శాతం లాభపడగా, డోజోన్స్ 0.32 శాతం, నాస్‌డాక్ 0.02 శాతం లాభంతో ముగిశాయి.
వివరాలు
నేడు లాభాల బాటలో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మాత్రం నేడు లాభాల బాటలో ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని ఏఎస్‌ఎక్స్ 0.42 శాతం, జపాన్ నిక్కీ 0.51 శాతం, షాంఘై 0.26 శాతం, హాంగ్‌సెంగ్ 1.18 శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపుదారులు (FIIs) సోమవారం నాడు నికరంగా రూ.526 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపుదారులు (DIIs) అదే రోజున నికరంగా రూ.238 కోట్ల షేర్లను విక్రయించినట్టు సమాచారం.