LOADING...
Economic indicators: దేశవ్యాప్తంగా కీలక ఆర్థిక సూచికల సవరణకు సర్వే ప్రారంభం 
దేశవ్యాప్తంగా కీలక ఆర్థిక సూచికల సవరణకు సర్వే ప్రారంభం

Economic indicators: దేశవ్యాప్తంగా కీలక ఆర్థిక సూచికల సవరణకు సర్వే ప్రారంభం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2025
02:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని ప్రధాన ఆర్థిక సూచికలను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత సర్వే ప్రారంభించింది. ఇందులో ప్రస్తుత హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్‌(WPI)‌ను నవీకరించడం, తొలిసారిగా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్‌ (PPI)‌ను ప్రవేశపెట్టడం, అలాగే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌ (IIP)కు 2022-23 బేస్‌ ఇయర్‌గా మార్పులు చేయడం ఉంటాయి. తయారీ రంగ పరిస్థితులను స్పష్టంగా ప్రతిబింబించేలా ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను సమగ్రంగా రూపొందించడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశ్యం. PPIలో ఉత్పత్తులు హోల్‌సేల్ మార్కెట్‌కు చేరకముందే తయారీదారులు లేదా సేవలందించే వారు పొందే ధరల మార్పులను కొలుస్తారు.

Details

ఈనెల నుంచి సర్వే ప్రారంభం

వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేస్తూ, ఈ నెల నుంచే సర్వే ప్రారంభమవుతుందని తెలిపింది. 2022 ఏప్రిల్‌ నుండి గణాంకాలను రీట్రోస్పెక్టివ్‌గా సేకరించనున్నారు. ప్రస్తుత 2011-12 బేస్ ఇయర్‌తో ఉన్న WPI మార్పు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది.

Details

సర్వే అమలు విధానం

స్టాటిస్టిక్స్ చట్టం, 2008 (2017, 2023 సవరణలతో) ప్రకారం, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్‌ (NSO)-ఫీల్డ్ ఆపరేషన్స్ డివిజన్‌కు ఈ సర్వే నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దేశవ్యాప్తంగా 26 ప్రాంతీయ కార్యాలయాలకు స్టాటిస్టిక్స్ అధికారులను నియమించారు. వీరికి *GST ఇన్వాయిసులు, ఈ-వే బిల్లులు, బ్యాలెన్స్ షీట్లు వంటి రికార్డులు పరిశీలించే అధికారం ఉంటుంది. తయారీ, రిపేర్, గ్యాస్, వాటర్ సప్లై, కోల్డ్ స్టోరేజ్ రంగాల్లో నిమగ్నమైన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గల ఆర్గనైజ్డ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఈ సర్వేలో భాగమవుతాయి. ఫ్యాక్టరీ యాక్ట్, కంపెనీస్ యాక్ట్, షాప్స్ & ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ల కింద నమోదు చేసిన యాజమాన్యాలు తప్పనిసరిగా అవసరమైన డేటా సమర్పించాలి.

Details

డేటా సమర్పణ, శిక్షలు 

సమాచారాన్ని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రొమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్‌ (DPIIT)‌లోని ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ ప్రాసెస్ చేసి విడుదల చేస్తుంది. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా డేటా అందించవచ్చు. అవసరమైతే గరిష్టంగా ఒక నెల సమయం ఇవ్వొచ్చు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించే అధికారం ఉంటుంది. అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీల్ సదుపాయం కూడా ఉంటుంది.

Details

తయారీ రంగానికి మేలు

గత దశాబ్దంలో భారత తయారీ రంగం గణనీయంగా మారిపోయింది. ఈ సవరణ లేకపోతే ఆర్థిక సూచికలు పాతబడిపోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేందుకు ఇది ఉపకరిస్తుందని ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌ మాజీ చైర్మన్ అరుణ్ కుమార్ గరోడియా అన్నారు