Page Loader
Swiggy: డెలివరీ ఛార్జీల విషయంలో  స్విగ్గీకి జరిమానా
డెలివరీ ఛార్జీల విషయంలో స్విగ్గీకి జరిమానా

Swiggy: డెలివరీ ఛార్జీల విషయంలో  స్విగ్గీకి జరిమానా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2024
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.35,453 జరిమానా విధించింది. దీనికి కారణం, డెలివరీ దూరాలను అనవసరంగా పెంచి కస్టమర్ల నుంచి అధికంగా ఛార్జీలు వసూలు చేయడం అని కన్జ్యూమర్ కోర్టు తెలిపింది. స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ కలిగి ఉన్న కస్టమర్లకు కొంత దూరం వరకు ఉచిత డెలివరీ అందించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. అయితే, ఒక కస్టమర్‌కు అదనంగా డెలివరీ ఛార్జీ వసూలు చేసినట్లు కోర్టు అభిప్రాయపడింది.

వివరాలు 

నిర్దిష్ట దూరం వరకు ఉచిత డెలివరీ

హైదరాబాద్‌కు చెందిన సురేష్‌బాబు స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ కొనుగోలు చేశారు. ఈ మెంబర్‌షిప్‌ను ఉపయోగించి నవంబర్ 1, 2023న ఫుడ్ ఆర్డర్ చేశారు. సాధారణంగా, స్విగ్గీ ఈ మెంబర్‌షిప్‌కు లభించే ప్రత్యేక సేవలలో భాగంగా నిర్దిష్ట దూరం వరకు ఉచిత డెలివరీ అందించాలి. అయితే, సురేష్‌ బాబు ఆర్డర్ చేసిన దూరం కంపెనీ నిబంధనలకు లోబడి ఉన్నప్పటికీ, స్విగ్గీ డెలివరీ దూరాన్ని 9.7 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్లకు పెంచి రూ.103 అదనంగా ఛార్జ్ వేసింది.

వివరాలు 

స్విగ్గీకి 45 రోజుల గడువు

సురేష్‌బాబు అందించిన గూగుల్ మ్యాప్స్ స్క్రీన్‌షాట్‌లను సమీక్షించిన కోర్టు, డెలివరీ దూరంలో అనవసర మార్పును గుర్తించింది. విచారణకు స్విగ్గీ తరపు నుండి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో కోర్టు సాక్ష్యాల ఆధారంగా తీర్పు ప్రకటించింది. అందులో భాగంగా, రూ.103 డెలివరీ ఛార్జీకి తోడు, ఫిర్యాదు తేదీ నుండి 9 శాతం వడ్డీతో కూడిన రూ.350.48ను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. కస్టమర్‌కు కలిగిన అసౌకర్యానికి చెల్లించేందుకు రూ.5,000, ఫిర్యాదు ఖర్చులకు మరిన్ని రూ.5,000 కూడా చెల్లించాలని, అదనంగా రూ.25,000 నష్టపరిహారాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని కమిషన్ సూచించింది. కోర్టు ఆదేశాలను పాటించేందుకు స్విగ్గీకి 45 రోజుల గడువు ఇచ్చింది.