Swiggy IPO: స్విగ్గీ ఐపీఓ 8% ప్రీమియంతో ఇవాళ లిస్టింగ్
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇవాళ దలాల్ స్ట్రీట్‌లో తన ఐపీఓతో మార్కెట్లో ప్రవేశించింది. మదుపర్లు దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఐపీఓ షేర్లు ఇవాళ మార్కెట్లో లిస్టింగ్ అయ్యాయి. మార్కెట్ ప్రారంభంలో ఎన్‌ఎస్‌ఈలో రూ.420 వద్ద షేర్లు మొదలయ్యాయి, అంటే ఇష్యూ ధర రూ.390తో పోలిస్తే 8శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. అదే విధంగా బీఎస్‌ఈలో షేర్లు రూ.412 (5.64% ప్రీమియం) వద్ద ప్రారంభమయ్యాయి. స్విగ్గీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 8న ముగిసింది. దీనికి ధర శ్రేణి రూ.371-390గా నిర్ణయించారు. ఈ కొత్త షేర్ల జారీ ద్వారా రూ.4,499 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.6,828 కోట్లు సమీకరించడానికి కంపెనీ ప్రణాళిక వేసింది.
రూ. 57.53 కోట్ల షేర్లకు బిడ్ల దాఖలు
ప్రారంభం లో స్విగ్గీ ఐపీఓ కి తక్కువ ఆదరణే లభించినా, చివరి రోజున మాత్రం సబ్‌స్క్రిప్షన్‌లో అధిక స్పందన కనిపించింది. మొత్తం రూ.11,327 కోట్ల ఐపీఓ 3.599 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. రూ. 16 కోట్ల షేర్లకు 57.53 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ల కోటా 6.02 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంది. రిటైల్ ఇన్వెస్టర్ల పక్షం 1.14 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. నాన్ ఇనిస్టిట్యూషనల్ కోటా 41% మాత్రమే సబ్‌స్క్రిప్షన్ పొందింది. ఇప్పటికే రూ.5,085 కోట్లు యాంకర్ ఇన్వెస్టర్ల నుండి సమీకరించుకున్నది.