Page Loader
Swiggy: 3,750 కోట్ల స్విగ్గీ మెగా ఐపీఓ- అతి త్వరలో లాంచ్​!
3,750 కోట్ల స్విగ్గీ మెగా ఐపీఓ- అతి త్వరలో లాంచ్​!

Swiggy: 3,750 కోట్ల స్విగ్గీ మెగా ఐపీఓ- అతి త్వరలో లాంచ్​!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 27, 2024
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీ, ఐపీఓ ద్వారా రూ. 3,750 కోట్లను సమీకరించేందుకు సెబీకి డీఆర్‌హెచ్‌పీ పేపర్స్‌ను ఫైల్ చేసింది. ఈ ఐపీఓలో భాగంగా సుమారు 18.5 కోట్ల షేర్లను అన్‌లోడ్ చేయనుంది. స్విగ్గీ ఐపీఓలో, కంపెనీ ఫౌండర్లు శ్రీహర్ష, రాహుల్ జైమిని వరుసగా 1.7 లక్షలు, 1.1 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఎర్లీ ఇన్వెస్టర్లు అయిన ఎస్సెల్, ప్రోసుస్, మైతువాన్, నార్వెస్ట్ వెంచర్ పార్ట్‌నర్స్, ఆల్ఫా వేవ్ వెంచర్స్, కోటక్ మరియు టెన్సెంట్ క్లౌడ్ కూడా షేర్లను విక్రయించడానికి సన్నద్ధమవుతున్నారు. సెబీకి స్విగ్గీ తొలి వెర్షన్ డీఆర్‌హెచ్‌పీ పేపర్స్‌ను అందించింది. రానున్న రోజుల్లో అప్డేటెడ్ వెర్షన్, తర్వాత ఫైనల్ వెర్షన్‌ను కూడా ఫైల్ చేయనుంది.

వివరాలు 

స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్న రెండవ ఫుడ్ టెక్ కంపెనీ స్విగ్గీ

ఆ సమయంలో స్విగ్గీ ఐపీఓకి సంబంధించి మరిన్ని వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇంకా, ఈ ఏడాది నవంబరులో స్విగ్గీ ఐపీఓ లాంచ్ అవుతుందని ఊహాగానాలు ఉన్నాయి, అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు. స్విగ్గీ ఐపీఓ తేదీ గురించి రానున్న రోజుల్లో స్పష్టత రానుంది. జొమాటో తర్వాత స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్న రెండవ ఫుడ్ టెక్ కంపెనీ స్విగ్గీ. ఐపీఓ కోసం కొటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, జెఫరీస్ ఇండియా, అవెండస్ క్యాపిటల్‌ను బ్యాంకర్లుగా సంస్థ నియమించింది. ఫుడ్ డెలివరీ,క్విక్ కామర్స్ విభాగాల్లో వేగవంతమైన వృద్ధితో, 2024 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ తన నష్టాలను 43% తగ్గించుకుంది.

వివరాలు 

గ్రాస్ ఆర్డర్ విలువలో పెరుగుదల 

కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 36% పెరిగి రూ. 11,247 కోట్లకు చేరుకుంది.ఫుడ్ డెలివరీ, ఇన్‌స్టామార్ట్, డైనింగ్ వంటి కన్స్యూమర్ ఫేసింగ్ బిజినెస్‌లో రూ. 35,000 కోట్ల స్థూల ఆర్డర్ విలువ (జీఓవీ) నమోదైంది. 2025 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో స్విగ్గీ కన్సాలిడేటెడ్ వ్యాపారం స్థూల ఆర్డర్ విలువ (జిఒవి) రూ. 10,189 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో, 2024 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 34% పెరిగి రూ. 3,222 కోట్లకు చేరుకుంది. తమ వ్యాపారం ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో కేంద్రీకృతం కాలేదని,కొత్త నగరాల్లో తమ యూజర్ మరియు భాగస్వామ్య స్థలాలను విస్తరించడానికి కంపెనీ ఈ ఆదాయాన్ని ఉపయోగిస్తుందని స్విగ్గీ తెలిపింది.

వివరాలు 

ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఇన్‌స్టామార్ట్ విస్తరణకు..

బ్లింకిట్, జెప్టో, బిగ్ బాస్కెట్ వంటి పోటీదారులు క్విక్ కామర్స్ రంగంలో తమ ఉనికిని ముమ్మరం చేస్తున్నందున, స్విగ్గీ ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఇన్‌స్టామార్ట్ విస్తరణకు కేటాయించాలని ఈ ఫుడ్ డెలివరీ సంస్థ యోచిస్తోంది. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్, ఫస్ట్ క్రై, యూనికామర్స్ ఐపీఓల్లో లాభాలు ఆర్జించిన సాఫ్ట్‌బ్యాంక్ ఓఎఫ్ఎస్ కింద తన వాటాను విక్రయించడం లేదు. ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ తన వాటాను కొనసాగించే అవకాశం ఉందని మింట్ గతంలో నివేదించింది.

వివరాలు 

మార్జిన్లను మెరుగుపరచడంపై దృష్టి

అనేక నగరాల్లో ఉనికిని మరింత విస్తరించడం కోసం, కిరాణా, గృహ నిత్యావసరాలను అందించే డార్క్ స్టోర్ల నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయడానికి స్విగ్గీ తాజా నిధులను ఉపయోగిస్తుందని మింట్ ఈ నెల ప్రారంభంలో నివేదించింది. 2014లో రెస్టారెంట్ అగ్రిగేటర్‌గా ప్రారంభమైన బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్, గత 18 నెలలుగా మార్జిన్లను మెరుగుపరచడంపై దృష్టి సారించింది. 2023 మార్చిలో తమ ఫుడ్ డెలివరీ యూనిట్ లాభదాయకంగా మారిందని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీహర్ష మాజేటి తెలిపారు.