LOADING...
Tech Layoffs Surge: టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు.. కానీ ఈ ఏఐ జాబ్‌కు మాత్రం 729% డిమాండ్!
టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు.. కానీ ఈ ఏఐ జాబ్‌కు మాత్రం 729% డిమాండ్!

Tech Layoffs Surge: టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు.. కానీ ఈ ఏఐ జాబ్‌కు మాత్రం 729% డిమాండ్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం ప్రస్తుతం ఉద్యోగాలకోతలతో సతమతమవుతోంది. వేలాది మంది ఉద్యోగులు లేఆఫ్స్ బారిన పడుతున్న వేళ, ఒక ప్రత్యేకమైన ఇంజనీరింగ్ ఉద్యోగం మాత్రం ఊహించని స్థాయిలో అవకాశాలను సృష్టిస్తోంది. 'ఫార్వర్డ్-డిప్లాయ్డ్ ఇంజనీర్'(FDE)గా పిలిచే ఈ ఉద్యోగానికి డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 729 శాతం పెరగడం విశేషం. ఈ పోస్టులకు కంపెనీలు భారీ వేతన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. వార్షికంగా 1.లక్షల డాలర్ల నుంచి 2లక్షల డాలర్ల వరకు జీతాలు ఇస్తున్నాయి. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.4 కోట్ల నుంచి రూ.1.6కోట్లకు పైగా ఉంటుంది. ప్రముఖ ఉద్యోగాల వేదిక ఇండీడ్ గణాంకాల ప్రకారం,2025 ఏప్రిల్‌లో 643గా ఉన్న ఎఫ్‌డీఈ ఉద్యోగ ప్రకటనలు 2026 ఏప్రిల్ నాటికి 5,330కు పెరిగాయి.

వివరాలు 

మరోవైపు టెక్ రంగంలో భారీ లేఆఫ్స్

ప్రస్తుతం ఆంత్రోపిక్, ఓపెన్ఏఐ, స్ట్రైప్, గూగుల్ క్లౌడ్, పలాంటిర్ వంటి ప్రముఖ టెక్ సంస్థలతో పాటు మెకిన్సేకు చెందిన ఏఐ విభాగం క్వాంటమ్‌బ్లాక్ కూడా ఈ పోస్టుల కోసం భారీగా నియామకాలు చేపడుతోంది. ఎఫ్‌డీఈ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుండగా, మిగతా టెక్ రంగంలో పరిస్థితి మాత్రం ఆందోళనకరంగానే ఉంది. Layoffs.fyi గణాంకాల ప్రకారం, ఈ ఏడాది 150కిపైగా కంపెనీల్లో 1.15 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. మరోవైపు ట్రూఅప్ సంస్థ ఈ సంఖ్య 1.48 లక్షలకు చేరిందని వెల్లడించింది. ప్రధానంగా మెటా 8,000 మంది ఉద్యోగులను, సిస్కో 4,000 మందిని, ఇంటుఇట్ 3,000 మందిని, క్లౌడ్‌ఫ్లేర్ 1,100 మందిని, స్నాప్ 1,000 మందిని, కాయిన్‌బేస్ 700 మందిని తొలగించాయి.

వివరాలు 

4,800 ఉద్యోగాలను తగ్గించనున్న పేపాల్

పేపాల్ కూడా రాబోయే కొన్నేళ్లలో సుమారు 4,800 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు సమాచారం. లింక్డ్‌ఇన్, విక్స్, గ్రూపన్, వెబ్‌ఫ్లో, క్లిక్‌అప్, అమెజాన్ వంటి సంస్థలు కూడా ఉద్యోగాల కోతల దిశగా అడుగులు వేస్తున్నాయి. గతంలో అవసరానికి మించి నియామకాలు చేపట్టడం, మార్కెట్ వాటా తగ్గడం, కొన్ని వ్యాపార ప్రయోగాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం వంటి కారణాలు ఈ పరిస్థితికి దారితీసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

ఫార్వర్డ్-డిప్లాయ్డ్ ఇంజనీర్ పని ఏమిటి?

ఫార్వర్డ్-డిప్లాయ్డ్ ఇంజనీర్ అనేది ఏఐ టెక్నాలజీని నేరుగా వ్యాపార అవసరాలకు అనుసంధానించే కీలకమైన బాధ్యత. ఈ నిపుణులు ఏఐ సాఫ్ట్‌వేర్‌ను కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మార్చి, వారి వ్యాపార కార్యకలాపాల్లో సమర్థంగా అమలు చేస్తారు. అంతేకాకుండా సిస్టమ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా అది సజావుగా పనిచేస్తుందో లేదో పర్యవేక్షిస్తారు. ఈ కాన్సెప్ట్‌ను తొలిసారిగా పలాంటిర్ సంస్థ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అనేక టెక్ కంపెనీలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఏఐ విస్తరణలో ఎఫ్‌డీఈలు కీలక పాత్ర పోషిస్తున్నారని బాక్స్ సీఈవో ఆరోన్ లెవీ పేర్కొన్నారు. అలాగే కస్టమర్ల నుంచి వస్తున్న పెరుగుతున్న డిమాండ్ కారణంగానే ఎఫ్‌డీఈ నియామకాలను విస్తరిస్తున్నామని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ తెలిపారు.

Advertisement

వివరాలు 

కన్సల్టింగ్ సంస్థలూ అదే బాటలో..

కేవలం టెక్ కంపెనీలే కాకుండా కన్సల్టింగ్ సంస్థలు కూడా ఇప్పుడు ఏఐ ఆధారిత పరిష్కారాలను మార్కెట్‌లోకి తీసుకురావడానికి ఈ తరహా నిపుణుల కోసం వెతుకుతున్నాయి. మెకిన్సే అనుబంధ సంస్థ క్వాంటమ్‌బ్లాక్‌లో 'ప్రిన్సిపల్ ఫార్వర్డ్ డిప్లాయ్‌మెంట్ ఇంజనీర్' పోస్టులకు కంప్యూటర్ సైన్స్ లేదా మెషీన్ లెర్నింగ్‌లో డిగ్రీతో పాటు కనీసం ఎనిమిదేళ్ల సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అర్హతగా కోరుతోంది. అటు కన్సల్టింగ్ నైపుణ్యాలు, ఇటు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం రెండూ కలిగిన అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు క్వాంటమ్‌బ్లాక్ సహ-నేత అలెక్స్ సింగ్లా తెలిపారు.

వివరాలు 

భవిష్యత్తు నైపుణ్యాలకే ప్రాధాన్యం

ఈ పరిణామాలు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కంపెనీలు నియామకాలను పూర్తిగా నిలిపివేయలేదు. అయితే భవిష్యత్తులో తమ వ్యాపారాలకు కీలకంగా మారే నైపుణ్యాలు కలిగిన వారినే ఎంపిక చేస్తున్నాయి. ముఖ్యంగా ఫార్చ్యూన్ 500 కంపెనీల కార్యకలాపాల్లో ఏఐ పరిష్కారాలను విజయవంతంగా అమలు చేయగల నిపుణులకు ప్రస్తుతం మార్కెట్‌లో భారీ డిమాండ్‌తో పాటు ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి.

Advertisement