Lee Thiam Wah: పోలియోతో బాధపడుతున్నా.. రోడ్‌సైడ్ స్నాక్స్ స్టాల్‌తో వేల కోట్ల సామ్రాజ్యం.. ఈ బిలియనీర్ కథ ఏంటో తెలుసా?
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే వాక్యానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇతను. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, అనేక కష్టాలను తట్టుకుని, బాధలు, అవమానాలను దిగమింగుకొని ఉన్నత శిఖరాలను చేరిన అనేకమంది మనకు స్ఫూర్తిని ఇచ్చే వ్యక్తులుగా నిలుస్తారు. తినడానికి మూడు పూటల భోజనం కూడా లేకున్నా, ఇప్పుడు వేల కోట్లు సంపాదించిన వ్యక్తులు ఉన్నారు. అలాంటిదే ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, ఇప్పుడు బిలియనీర్ల జాబితాలో చేరిన ఒక వ్యక్తి కథ.
ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ వెనుదిరగలేదు
లీ థియామ్ వా.. మలేసియా క్లాంగ్‌లోని ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన లీ, 60ఏళ్ల వయసులో శారీరక వైకల్యం ఏ మాత్రం అడ్డుకాదని నిరూపించారు. చిన్న వయసులోనే పోలియో వ్యాధితో రెండు కాళ్లు పనిచేయకపోయినా,అతను నిరుత్సాహపడలేదు. కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే స్కూల్‌కు వెళ్లిన లీ,తన ఆత్మవిశ్వాసంతో రోడ్డు పక్కన చిన్న షాపుతో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు,ఆయన ఒక బిలియనీర్‌గా ఎదిగారు. కాళ్లు పని చేయకపోయినా,లీ ఉపాధి మార్గం కోసం అన్వేషణను ఆపలేదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ వెనుదిరగలేదు. ఒక చిన్న స్నాక్స్ షాప్‌తో మొదలుపెట్టి,కొన్నేళ్లకు'99 స్పీడ్‌మార్ట్'పేరుతో మొదటి కిరాణా షాపును ప్రారంభించారు. తన కృషితో మలేసియాలో మొత్తం దాదాపు 2700 దుకాణాలు విస్తరించి,రిటైల్ రంగంలో ఒక దిగ్గజంగా ఎదిగారు.
'99 స్పీడ్‌మార్ట్' ఐపీఓ ద్వారా 531 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది
తాజాగా, లీ తన కంపెనీని ఐపీఓ (పబ్లిక్ ఇనిషియల్ ఆఫరింగ్) ద్వారా పబ్లిక్ మార్కెట్‌లోకి రావడంతో.. ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. ఈ నిధుల సేకరణ అతన్ని బిలియనీర్‌గా మార్చింది.'99 స్పీడ్‌మార్ట్' ఐపీఓ ద్వారా 531 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. ఇది గత ఏడు సంవత్సరాల్లో మలేసియా స్టాక్ మార్కెట్‌లో జరిగిన అతిపెద్ద ఐపీఓ. ఫోర్బ్స్ ప్రకారం, ఐపీఓ ప్రారంభమైన తొలి రోజే కౌలాలంపూర్ స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్లు 15 శాతం పెరిగాయి.
లక్ష్యం
ఈ ఐపీఓతో,లీ థియామ్ వా నికర సంపద 3.3 బిలియన్ డాలర్లకు చేరింది.ఇది భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 27 వేల కోట్లకుపైనే ఉంటుంది. ఇప్పుడు ఆయన మలేసియాలో అత్యంత సంపన్నులలో ఒకరిగా నిలిచారు.లీ బర్గర్ కింగ్ వంటి సంస్థల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. ఇక ముందు, సేకరించిన నిధులతో తన స్టోర్ల సంఖ్యను 3 వేలకు పెంచే లక్ష్యాన్ని సాధించాలని ఆయన ఆశిస్తున్నారు.