Page Loader
Crude oil prices: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు
ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు

Crude oil prices: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో మరో యుద్ధ భయాలు ప్రపంచవ్యాప్తంగా జగద్దలమైన పరిస్థితిని తలపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఆర్థిక రంగం నుంచి రవాణా వ్యవస్థ వరకు అనేక అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

Details

ముడిచమురు ధరలపై ప్రభావం 

ఇజ్రాయెల్‌ ప్రారంభించిన 'ఆపరేషన్‌ లయన్‌'కు ప్రతిస్పందనగా ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగింది. ఈ పరిణామాలు మూడవ దేశాలపై తీవ్ర ప్రభావం చూపేలా యుద్ధంలా మారే ముప్పును రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ముడిచమురు ధరలు గణనీయంగా పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్‌ రోజుకు 3.3 మిలియన్‌ బ్యారెళ్ల ముడిచమురు ఉత్పత్తి చేస్తూ, దానిలో 1.5 మిలియన్‌ బ్యారెళ్లను ఎగుమతి చేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం హోర్ముజ్‌ జలసంధి ద్వారా సాగుతోంది. ఇరాన్‌ గతంలో దాడులు జరిగితే ఈ రవాణా మార్గాన్ని అడ్డుకుంటామని హెచ్చరించడంతో భయం మరింత పెరిగింది. ఈపరిస్థితుల్లో ముడిచమురు ధరలు 120 నుంచి 130 డాలర్ల వరకు పెరిగే అవకాశముంది.

Details

విమానయాన రంగంపై దెబ్బ

ఈ ఉద్రిక్తతల ప్రభావం విమానయాన రంగంపైనా తీవ్రంగా పడుతోంది. గగనతలం మూసివేతలతో ఎయిర్‌లైన్లకు మార్గాలు మార్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా తన 20 విమానాలను మార్గం మార్చినట్టు వెల్లడించింది. పలు దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో ముంబయి-లండన్‌ మార్గం పైనే కాకుండా, సౌదీ అరేబియా, తుర్కియే మార్గాల్లో ట్రాఫిక్‌ పెరుగుతోంది. దీనివల్ల విమాన రద్దీతో పాటు నిర్వహణ ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా టికెట్‌ ధరల పెరుగుదల కూడా తప్పనిసరి కావొచ్చని భావిస్తున్నారు.

Details

పసిడి ధరలపై ప్రభావం 

యుద్ధ భయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం సహజం. అందుకే బంగారం వంటి విలువైన లోహాలపై డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరగబోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సామాన్యులపై భారం పెరగడానికి దారి తీస్తుంది.

Details

ఎగుమతులపై ప్రభావం 

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఘర్షణలు భారత ఎగుమతులపైనూ తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. సూయిజ్‌ కాలువ, ఎర్ర సముద్ర మార్గాలను మూసివేస్తే భారత నౌకలు కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ మార్గాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. దీని వల్ల ప్రయాణ సమయం 15-20 రోజులు పెరుగుతుంది. ఒక్కో కంటైనర్‌పై అదనంగా 500-1000 డాలర్ల వరకు ఖర్చు అయ్యే అవకాశముంది. మొత్తంగా, ఎగుమతుల వ్యయం 40-50 శాతం పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదనంగా, ఇరాన్‌ నుంచి నేరుగా ముడిచమురు దిగుమతి చేసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది నూతనంగా చమురు ధరల పెరుగుదలని ఉత్పన్నం చేస్తుంది.

Details

మొత్తం ప్రభావం

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన ప్రతిసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావాలు పడుతుండటం కొత్త విషయం కాదు. ఈసారి కూడా పరిస్థితి గణనీయంగా గందరగోళంగా మారే అవకాశం ఉంది. చమురు ధరలు, విమాన రవాణా, బంగారం, ఎగుమతులపై దెబ్బతో భారతదేశం సహా అనేక దేశాలపై ప్రభావం తప్పదు.