కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో టెస్లా ఉన్నతాధికారుల కీలక చర్చలు
ప్రముఖ లగ్జరీ ఈవీ కార్ల తయారీ సంస్ఠ టెస్లా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కీలక చర్చలు జరిపారు. గత వారం టెస్లా కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశం నిర్వహించారు. దిల్లీలోని ఓ హోటల్‌ల్లో జరిగిన ఈ భేటీలో టెస్లా టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కేంద్రమంత్రిని ప్రైవేట్ గా కలిసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఆటో మార్కెట్లో టెస్లా విడుదల చేసిన కార్లతో పోల్చితే సుమారు 25 శాతం మేర తక్కువ ధరలకే ఇండియాలో ఎలక్ట్రిక్ కారు (EV)ని అందించేందుకు గల అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక్కో కారును దాదాపు 24 వేల డాలర్ల ధరకే ఉత్పత్తి చేసేలా కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
స్థానిక భాగస్వాముల కోసం ఆపిల్ సంస్థను ఆదర్శంగా తీసుకోవాలని టెస్లాకు సూచన
ఇదే విషయంపై టెస్లా పబ్లిక్ పాలసీ బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ రోహన్ పటేల్, సప్లై చైన్ వైస్ ప్రెసిడెంట్ రోషన్ థామస్ అధికారులతో భేటీ అయ్యారు. జూన్ లో ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా ఆ కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ మోదీతో సమావేశమయ్యారు. ఈమేరకు భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తిని కనబర్చిన విషయం తెలిసిందే. మరోవైపు టెస్లాతో, అధికారుల చర్చలను గోప్యంగా ఉంచుతున్నారని, ప్రధాని సహా పీఎంఓ చర్చల పురోగతిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు నివేదిక బహిర్గతం చేసింది. ఈ ప్రాజెక్టులో కారు విడిభాగాలను చైనాకు చెందిన సరఫరాదారులను భాగస్వామ్యం చేసేందుకు టెస్లా యత్నిస్తోంది. స్థానిక భాగస్వాముల కోసం ఆపిల్ సంస్థను ఆదర్శంగా తీసుకోవాలని టెస్లాకు కేంద్రం సూచించింది.