Page Loader
Boeing: సమ్మె ప్రభావం.. బోయింగ్‌ సంస్థలో 17వేల ఉద్యోగాలపై వేటు
సమ్మె ప్రభావం.. బోయింగ్‌ సంస్థలో 17వేల ఉద్యోగాలపై వేటు

Boeing: సమ్మె ప్రభావం.. బోయింగ్‌ సంస్థలో 17వేల ఉద్యోగాలపై వేటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2024
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్ర‌ముఖ విమాన త‌యారీ సంస్థ బోయింగ్‌ (Boeing) భారీ సంఖ్యలో ఉద్యోగుల‌ను తొల‌గించేందుకు సిద్ధమైంది. సియాటెల్ ప్రాంతంలో నెల‌కొన్న కార్మికుల సమ్మె వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాల దృష్ట్యా, బోయింగ్‌ ఈ నిర్ణయాన్ని తీసుకొంది. బోయింగ్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 17,000 మంది సిబ్బందిపై వేటు వేసేందుకు సిద్ధమవుతోందని, అంటే మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. సియాటెల్‌ ప్రాంతంలో 33,000 మంది కార్మికులు నెల నుండి సమ్మె చేస్తున్నారు, దీనివల్ల 737 MAX, 767, 777 జెట్‌ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. సమ్మె కారణంగా సంస్థ మూడో త్రైమాసికంలో 5 బిలియన్ డాలర్ల నష్టం చవిచూసింది. ఈ విషయాన్ని బోయింగ్‌ సంస్థ వెల్లడించింది.

Details

బోయింగ్ షేర్లు 1.1శాతం తగ్గుముఖం

ఈ ఆర్థిక నష్టాలను పూడ్చుకోవడం కోసం ఉద్యోగుల తొలగింపు అత్యవసరమని బోయింగ్‌ సీఈఓ కెల్లీ ఓర్ట్‌బర్గ్‌ తెలిపారు. రానున్న నెలల్లో మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని తొలగించేందుకు ప్రణాళిక సిద్ధమైందని, ఇందులో ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు కూడా ఉన్నారని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బోయింగ్‌ దీర్ఘకాలికంగా నిలదొక్కుకునేందుకు ఈ కఠిన నిర్ణయాలు అవసరమని పేర్కొంది. సమ్మె కారణంగా, 777X జెట్ డెలివరీలు ఆలస్యమవుతుండగా, 2026 నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని బోయింగ్‌ వెల్లడించింది. ఇక ప్రస్తుత ఆర్డర్లను పూర్తి చేసిన తరువాత, 2027లో 767 ఫ్రైటర్ ఉత్పత్తిని నిలిపివేయాలన్న యోచనలో ఉంది. ఈ ప్రకటనల నేపథ్యంలో బోయింగ్‌ షేర్లు 1.1 శాతం తగ్గుముఖం పట్టాయి.