Weddings huge Expenses: భారీ ఖర్చుతో పెళ్లిళ్ల హంగామా.. రూ.4.25 లక్షల కోట్ల ఆర్థిక ప్రభావం
పెళ్లి అంటే భారతీయ సమాజంలో ఒక పెద్ద పండుగ. సందడి, కోలాహలం, బంధుమిత్రుల రాకపోకలు, విశేషమైన ఆచార వ్యవహారాలు అన్నీ ఈ వేడుకకు ప్రత్యేకమైన వన్నె తెచ్చాయి. భారతీయ కుటుంబాలు తమ వారి పెళ్లి కోసం ప్రాధాన్యతనిస్తారు. ఖరీదైన బట్టలు, ఆభరణాలు, కార్ల బుకింగ్స్ వంటి ఖర్చులను తాహతకు మించి వెచ్చిస్తుంటారు. ఈ నేపథ్యంలో, పెళ్లి సీజన్‌ను పెద్ద వ్యాపార అవకాశంగా పరిగణిస్తున్న కార్పొరేట్ సంస్థలు, వివాహ రంగంలో అడుగుపెడుతున్నాయి.
నవంబర్, డిసెంబర్ లో భారీ ముహూర్తాలు
ఇంతకాలం పెళ్లిళ్ల నిర్వహణను చిన్న సంస్థలు మాత్రమే నిర్వహించేవి. కానీ పెళ్లి రంగంలో ఉన్న భారీ అవకాశాలను గమనించి, కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు వివాహ నిర్వహణ సేవల్లో ముందుకొస్తున్నాయి. ఈ రంగం నెమ్మదిగా సంఘటిత రంగంగా మారుతోంది. వివిధ వస్తువులు, సేవల సంస్థలు తమ ఆదాయంలో అధిక శాతం పెళ్లిళ్ల సీజన్‌లోనే పొందుతున్నాయి. ఈ ఏడాది దసరా తర్వాత నవంబరు, డిసెంబర్లో భారీ ముహూర్తాలు ఉండటంతో పెళ్లి వేడుకలు విస్తృతంగా జరిగే అవకాశం ఉంది.
ఈ సీజన్ లో 35 లక్షల పెళ్లిళ్లు
అంచనాల ప్రకారం, ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా 35 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని, దాదాపు రూ. 4.25 లక్షల కోట్ల వ్యయం కాబోతోందని ప్రభుదాస్ లీలాధర్ నివేదిక వెల్లడించింది. సంపన్నులు, సెలబ్రిటీలు తమ వివాహ వేడుకలను విదేశాల్లో ఘనంగా జరిపే కొత్త ట్రెండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రాచుర్యం పొందుతోంది. భారత ప్రభుత్వం ఈ ట్రెండ్‌ను గుర్తించి, మన దేశాన్ని కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రంగా మార్చే పథకాలను రూపొందిస్తోంది.
పెళ్లి వేదికలుగా పర్యాటక ప్రాంతాలు
25 ప్రధాన పర్యాటక ప్రాంతాలను పెళ్లి వేదికలుగా అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మనదేశం నుంచి వివిధ దేశాలకు డెస్టినేషన్ మ్యారేజెస్ కోసం వెళ్లి వ్యయాలు చేసే కుటుంబాలు ఎంతో విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నాయి. దీన్ని తగ్గించడానికి దేశంలోనే పర్యాటక కేంద్రాలను పెళ్లి వేదికలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.