అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ
అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తన తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే నివేదికను సుప్రీంకోర్టుకు సెబీ అందజేసే అవకాశం ఉంది. అయితే, సెబీ తన నివేదికను సమర్పించేందుకు అదనంగా 15 రోజుల గడువు కోరినట్లు మరో వార్త వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (ఎంపీఎస్) నిబంధనల్లో లొసుగులను ఉపయోగించుకోవడం ద్వారా అదానీ గ్రూప్ షేర్ల ధరలను తారుమారు చేసిందా? లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైందా? అనేదానికి సంబంధించి సెబీ దర్యాప్తు జరిపింది.
ఆగస్టు 29న సుప్రీంకోర్టు విచారణ
అదానీ గ్రూప్- హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కేసు విచారణ ఆగస్టు 29న సుప్రీంకోర్టులో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 14లోగా నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు విధించిన విషయం తెలిసిందే. సెబీ నివేదికలో ప్రతికూలమైన అంశాలు ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మరో రెండు లేదా మూడు రోజుల్లో నివేదికను సుప్రీంకోర్టుకు సెబీ సమర్పిస్తుందా? లేకుంటే 15రోజుల తర్వాత సమర్పించనుందో తెలియాల్సి ఉంది. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్ మార్కట్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఇదిలా ఉండగా, అదానీ పోర్ట్స్ & సెజ్ ఆడిటర్ పదవికి డెలాయిట్ రాజీనామా చేయడంతో అన్ని అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు సోమవారం బాగా పడిపోయాయి.