రికార్డు ఆదాయాన్ని రాబట్టిన ఆపిల్, భారత్‌పై అతినమ్మకాన్ని పెంచుకుంటున్న టిమ్ కుక్
ఆపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌పై చాలా నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. దానికి కారణం భారతదేశంలో 2022 చివరి త్రైమాసికంలో కంపెనీ రికార్డ్-సెట్టింగ్ పనితీరును చూపించింది. భారతదేశంలోని మొట్టమొదటి ఆపిల్ రిటైల్ స్టోర్ మార్చి 2023 నాటికి ప్రారంభం కానుంది. భారతదేశం కోసం కంపెనీ భారీ ప్రణాళికలను రూపొందిస్తుంది. 2022లో భారతదేశంలో ఆపిల్ ఆదాయం, షిప్‌మెంట్‌లు పెద్ద ఎత్తున పెరిగాయి. ఆపిల్ చైనా బయట తన తయారీ యూనిట్లను విస్తరించాలని ఆలోచిస్తుండడంతో, గత సంవత్సరం నిస్సందేహంగా భారతదేశాన్ని ఆపిల్ తర్వాతి తయారీ కేంద్రంగా మార్చడానికి అవకాశంగా మారింది. 2022 చివరి త్రైమాసికంలో, భారతదేశంలో ఆపిల్ ఐఫోన్ షిప్‌మెంట్లు సంవత్సరానికి 18% పెరిగి రెండు మిలియన్లకు చేరుకున్నాయి.
2022లో భారతదేశంలో కంపెనీ షిప్‌మెంట్‌లు సంవత్సరానికి 11% పెరిగాయి
త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత విశ్లేషకులతో మాట్లాడుతూ భారత్‌లో వ్యాపారాన్ని పరిశీలిస్తే, ఈ త్రైమాసికంలో ఆదాయ రికార్డును నెలకొల్పి ఈ సంవత్సరానికి రెండంకెల వృద్ధిని సాధించాము కాబట్టి చాలా సంతోషంగా ఉందని టిమ్ కుక్ అన్నారు. సైబర్‌మీడియా రీసెర్చ్ (CMR) డేటా ప్రకారం, 2022లో భారతదేశంలో కంపెనీ షిప్‌మెంట్‌లు సంవత్సరానికి 11% పెరిగాయి. ఇది భారతదేశంలో ఆపిల్ మార్కెట్ వాటాను 5.5%కి పెంచింది, ఇది మునుపెన్నడూ లేనిది. గత త్రైమాసికంలో షిప్పింగ్ అయిన రెండు మిలియన్ ఐఫోన్‌లలో, ఐఫోన్ 14 సిరీస్ 59% ఉంటే, ఐఫోన్ 13 సిరీస్ 32% ఉంది.