TRAI : వినియోగంలో లేని ఫోన్ నంబర్లు ఎన్ని రోజులకు ఇతరులకు ఇస్తారో తెలుసా
ట్రాయ్ కీలక విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించింది. రద్దయిన, డీయాక్టివేట్ అయిన ఫోన్ నంబర్లను దాదాపుగా మూడు నెలలు అంటే 90 రోజుల తర్వాతే వేరే వారికి కేటాయిస్తారు. ఈ మేరకు ట్రాయ్ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. డీయాక్టివేషన్, రద్దు చేసుకున్న మొబైల్ నంబర్లను కనీసం 90 రోజుల తర్వాతే ఎవరికైనా కేటాయిస్తామని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ అత్యన్నత న్యాయస్థానానికి దృష్టికి తీసుకెళ్లింది. ఇదే సమయంలో వ్యక్తుల డేటా ప్రైవసీ పాలసీ నేపథ్యంలో కొత్త వారికి నంబర్ కేటాయించే క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని ట్రాయ్ తెలిపింది. అయితే రద్దైన, డీయాక్టివేషన్ నంబర్ల విషయంలో సుప్రీంలో ఓ పిటిషన్ ధాఖలైంది. ఈ మేరకు ట్రాయ్ సుప్రీంకు బదులిచ్చింది.
వ్యక్తిగత డేటాకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పిటిషన్
వినియోగదారులు తమ ఫోన్ నంబర్లను కొద్ది కాలం వాడకుండా ఉంటే కొన్నాళ్లకు అయా నంబర్లు డీయాక్టివేట్ అవుతాయి. ఇంకొందరు నంబర్లు ఎక్కువగా ఉంటే పాత నంబర్లను రద్దు చేసుకుంటుంటారు. ఇలా రద్దైన నంబర్లు కొన్నాళ్ల తర్వాత వేరొకరికి కేటాయిస్తే డేటా దుర్వినియోగం జరిగే అవకాశం ఉందంటూ 2021లో సుప్రీంలో ఓ రిట్ పిటిషన్ దాఖలైంది. వాట్సప్ అకౌంట్ సమాచారంతో పాటు వ్యక్తుల వ్యక్తిగత డేటాకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పిటిషనర్ తరఫున వాదనలు జరిగాయి.
అందుకే 90 రోజుల విధానం పాటిస్తున్నాం : ట్రాయ్
ఈ క్రమంలోనే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా, ట్రాయ్ స్పందించింది. పాత వినియోగదారుడి ప్రైవసీకి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే 90 రోజుల వ్యవధిని పాటిస్తున్నామని ట్రాయ్ తెలియజేసింది. ఇదే సమయంలో వినియోగదారులు తమ వంతుగా పర్సనవల్ డేటాకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాయ్ సూచించింది. మరోవైపు వాట్సప్ సైతం స్పందించింది. డేటా దుర్వినియోగం కాకుండా తాము చర్యలు తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది. అకౌంట్ ఇన్-యాక్టివిటీని పరిశీస్తామని. 45 రోజుల కంటే ఎక్కువ రోజుల వాట్సాప్ యాక్టివ్ లో లేకుండా ఉండటంతో పాటు అనంతరం కొత్త ఫోన్లో యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్‌గా డేటా తొలిగిపోతుందని వాట్సప్ స్పష్టం చేసింది.