
Trump: మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే తాజా టమాటాలపై 17% టారిఫ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ప్రభుత్వం మెక్సికో నుండి దిగుమతి చేసుకునే తాజా టమాటాలపై 17% సుంకాన్ని విధించింది. మెక్సికో నుండి టమాటాలను దిగుమతి చేసుకునేటప్పుడు సుంకం విధించకుండా ఉండేందుకు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా అమెరికాలోని టమాటా పరిశ్రమను తిరిగి అభివృద్ధి చేయడమే కాక, దేశీయంగా ఉత్పత్తులను పెంచాలనే లక్ష్యాన్ని అమెరికా ప్రభుత్వం ముందుగా ఉంచుకుంది.
వివరాలు
ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు:
రెండు దశాబ్దాల క్రితం అమెరికాలో టమాటా మార్కెట్‌లో మెక్సికో వాటా 30% మాత్రమే ఉండగా, ఇప్పటికీ అది 70%కు పెరిగిందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. మెక్సికో నుంచి దిగుమతులు పెరగడం వల్ల అమెరికాలోని దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అక్కడి టమాటా సాగుదారులు ఆరోపిస్తున్నారు. తక్కువ ధరలకు టమాటాలను మెక్సికో అమెరికాకు ఎగుమతి చేస్తోందని, దీన్ని "డంపింగ్" అంటారని వాదిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో 2019లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని వాణిజ్య శాఖ రద్దు చేసింది. ఆ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, మెక్సికో కనీస ధరకు మాత్రమే టమాటాలను అమ్మాలి. ఇతర నిబంధనలను అనుసరించాల్సి ఉండేది. కానీ ఆ ఒప్పందం రద్దు కావడంతో ఇప్పుడు 17% సుంకం విధించారు.
వివరాలు
తలెత్తుతున్న వ్యతిరేకతలు, ఆందోళనలు:
ఈ సుంక విధింపు నిర్ణయాన్నిపలువురు వ్యతిరేకిస్తున్నారు.మెక్సికోలో టమాటాలు పండించే అమెరికా కంపెనీలు సహా చాలా మంది, అమెరికా వినియోగదారులకు తాజా టమాటాలు మరింత ఖరీదైనవిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్,నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఈ విషయంపై స్పందించాయి. వాణిజ్య శాఖ మెక్సికోతో మరోసారి చర్చించి ఒక ఒప్పందానికి రావాలని ఈ సంస్థలు సూచించాయి. ఈ సుంకాల విధింపు వల్ల అమెరికాలోని వినియోగదారులపై ఎంత మేర ప్రభావం పడుతుందో,మెక్సికో రైతులపై ఇది ఎంత వరకు ఒత్తిడిని తీసుకొస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఈచర్య ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు.