LOADING...
UAE exits OPEC: ఓపెక్‌ నుంచి యూఏఈ నిష్క్రమణ.. చమురు ధరలు, ప్రపంచ సరఫరా, భారత్‌పై ఎలా ప్రభావం చూపుతుంది?
చమురు ధరలు,ప్రపంచ సరఫరా,భారత్‌పై ఎలా ప్రభావం చూపుతుంది?

UAE exits OPEC: ఓపెక్‌ నుంచి యూఏఈ నిష్క్రమణ.. చమురు ధరలు, ప్రపంచ సరఫరా, భారత్‌పై ఎలా ప్రభావం చూపుతుంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2026
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్లలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) మే 1 నుంచి ఓపెక్‌, ఓపెక్‌ ప్లస్‌ కూటమి నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు పైగా, డబ్ల్యూటీఐ క్రూడ్‌ 99 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండటంతో సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి వద్ద సమస్యలు ప్రపంచ చమురు సరఫరాను ప్రభావితం చేస్తున్నాయి. 1960లో ఏర్పడిన ఓపెక్‌ ప్రధానంగా చమురు ఉత్పత్తిని నియంత్రించి ధరలను స్థిరంగా ఉంచడమే లక్ష్యంగా పని చేస్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్‌, ఇరాన్‌, కువైట్‌, యూఏఈ వంటి దేశాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

వివరాలు 

భవిష్యత్తులో ఓపెక్‌ ప్రభావం తగ్గే అవకాశాలు

ఈక్రమంలో యూఏఈ నిష్క్రమణకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఓపెక్‌ ఉత్పత్తిలో సుమారు 12శాతం వాటా ఉన్న యూఏఈ బయటకు రావడం ఆ కూటమికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటివరకు ఓపెక్‌ సభ్య దేశాలు ఉత్పత్తి కోటాలను పాటిస్తూ ధరలను నియంత్రించేవి. ఇకపై యూఏఈకు ఆ నియమాలు వర్తించవు.దీని వల్ల భవిష్యత్తులో ఓపెక్‌ ప్రభావం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూఏఈ ఎనర్జీ మంత్రి సుహైల్ అల్ మజ్రూయి ప్రకారం,ఈ నిర్ణయం దేశ దీర్ఘకాలిక ఇంధన వ్యూహంలో భాగమే. ఉత్పత్తిపై మరింత స్వేచ్ఛ కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 4.85మిలియన్ బ్యారెల్స్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న యూఏఈ, 2027 నాటికి 5 మిలియన్ బ్యారెల్స్‌కు పెంచే లక్ష్యంతో ముందుకెళ్తోంది.

వివరాలు 

హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు రవాణా

ప్రపంచ చమురు సరఫరా ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు రవాణా అవుతుంది. అక్కడి ఉద్రిక్తతలు ధరలను మరింత పెంచుతున్నాయి. తక్షణ ప్రభావం పరిమితంగానే ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నా, భవిష్యత్తులో యూఏఈ ఉత్పత్తి పెంచితే గ్లోబల్ మార్కెట్‌లో సరఫరా పెరిగే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

భారత్‌పై మిశ్రమ ప్రభావం

అదే సమయంలో ఓపెక్‌ నియంత్రణ తగ్గితే ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. భారత్‌ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది మిశ్రమ ప్రభావం చూపే అవకాశం ఉంది. తక్షణంగా ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ద్రవ్యోల్బణం, దిగుమతి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో సరఫరా పెరిగితే ధరలు తగ్గి భారత్‌కు ఊరటనివ్వొచ్చు. మొత్తం మీద యూఏఈ నిర్ణయం ప్రపంచ ఇంధన మార్కెట్‌లో పెద్ద మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు.

Advertisement