LOADING...
ENGW vs SLW: వరల్డ్ కప్‌లో దుమ్మురేపిన ఇంగ్లండ్.. శ్రీలంకపై 87 పరుగుల తేడాతో విజయం!
వరల్డ్ కప్‌లో దుమ్మురేపిన ఇంగ్లండ్.. శ్రీలంకపై 87 పరుగుల తేడాతో విజయం!

ENGW vs SLW: వరల్డ్ కప్‌లో దుమ్మురేపిన ఇంగ్లండ్.. శ్రీలంకపై 87 పరుగుల తేడాతో విజయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 13, 2026
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026కు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు అద్భుత ప్రదర్శనతో విజయభేరి మోగించింది. శ్రీలంకతో జరిగిన తొలి పోరులో ఇంగ్లండ్‌ 87 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి తమ ప్రచారాన్ని విజయవంతంగా ప్రారంభించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 219 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో డానీ వ్యాట్‌ హాట్జ్‌ విశ్వరూపం ప్రదర్శించింది. కేవలం 62 బంతుల్లోనే 105 పరుగులు చేసి మెరుపు సెంచరీ సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో శక్తివంతమైన షాట్లు అభిమానులను అలరించాయి.

వివరాలు

132 పరుగులకే పరిమితమైన శ్రీలంక

మరోవైపు అమీ జోన్స్‌ 53 పరుగులు చేయగా, నాట్‌ సీవర్‌ బ్రంట్‌ 46 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. ఇంగ్లండ్‌ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు లంక బ్యాటర్లు నిలవలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 132 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో నీలక్షిక సిల్వా 39 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, హర్షిత సమరవిక్రమ 29 పరుగులు చేసింది. అయితే మిగతా బ్యాటర్ల నుంచి ఆశించిన సహకారం లభించలేదు.

వివరాలు

డానీ వ్యాట్‌ హాట్జ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు

ఇద్దరు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే వెనుదిరగగా, మరో ఐదుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ప్రేయ కెంప్‌ నాలుగు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించింది. బ్యాట్‌తో సెంచరీ, జట్టు విజయానికి కీలక పాత్ర పోషించిన డానీ వ్యాట్‌ హాట్జ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. టోర్నీలో తమ తదుపరి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ జూన్‌ 16న ఐర్లాండ్‌తో ఆడనుండగా, అదే రోజు శ్రీలంక జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది.

Advertisement