రూ.2 వేల నోట్ల మార్పిడిపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన
రూ.2వేల నోట్ల మార్పిడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చలామణీలో ఉన్న రూ.2 వేల నోట్ల ఉపసంహరణకు విధించిన గడువును మరింత పొడింగించే ప్రతిపాదన తమ వద్ద లేదని ప్రకటించింది. మరోవైపు నోట్ల మార్పిడి గడువు పొడిగిస్తారా లేక నోట్ల పరిమితిని పెంచుతారా అని చాలా మంది ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రశ్నలన్నింటికీ కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం నోట్లను మార్చుకోకుండా ఎవరైనా ఉంటే వెంటనే మార్చుకోవాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్ సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు.
నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధింపు
రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కేంద్రం సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. గత నెల జూన్ 30 నాటికి సుమారు రూ. 2.72 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు వివిధ బ్యాంకులకు చేరాయని ఆర్‌బీఐ వెల్లడించింది. మరో రూ.84 వేల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు చెలామణిలో ఉన్నాయని వివరించింది. వ్యవస్థలోని సుమారు 76 శాతం మేర రూ. 2 వేల నోట్లు వెనక్కి వచ్చినట్లు RBI పేర్కొంది. ఆయా డబ్బును వినియోగదారులు పలు బ్యాంకుల్లో డిపాజిట్, నోట్ల మార్పిడి రూపంలో కార్యకలాపాలు చేశారని స్పష్టం చేసింది.