ప్రధాని మోదీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. హింసకు పోలీసులూ కారణమేనట
మణిపూర్‌లో చెలరేగుతున్న హింస నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండున్నర నెలల క్రితం రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభమైనప్పుడే ఈ సమస్యను అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు పోలిన్‌లాల్ హోకిప్ వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్ ను కోరినట్లు చెప్పారు. ఇప్పటికీ తమను కలిసేందుకు మోదీ ఒప్పుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో అసలు బయటకు రాకుంటే మణిపూర్ హింసపై ప్రధాని మోదీ అసలు మాట్లాడేవారే కాదన్నారు. ఇక సీఎం పదవికి బీరేన్‌సింగ్ అనర్హుడని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల నగ్న ఊరేగింపు బయటకు వస్తే గానీ మణిపూర్‌లో ఏం జరుగుతుందో ప్రధానికి, అమిత్ షాకు తెలియలేదన్నారు.
సైన్యం ప్రేక్షకపాత్ర వహిస్తోంది: పోలిన్‌లాల్
కుకీలపై మైతీ గుంపులతో పాటు పోలీసులు కూడా దాడులు చేస్తున్నారని పోలిన్‌లాల్ ఆరోపించారు. మైతీలు, పోలీసులు కలిసే మారణ కాండకు పాల్పడుతున్నట్లు మండిపడ్డారు. ఇది శాంతిభద్రతల సమస్య కాదని, దీని వెనుక పెద్ద కుట్ర ఏదో దాగి ఉందని పోలిన్‌లాల్ కుండబద్దలు కొట్టారు. హింసకు మైతీలతో పాటు పోలీసులను కారణంగా చెప్పుకొచ్చారు. మణిపూర్ ఘటనలు మానవ హక్కుల సమస్య అని, దీంతో తీవ్రమైన రాజకీయ సంక్షోభం మొదలైందన్నారు. రక్షించాల్సిన సైన్యం ప్రేక్షకపాత్ర పోషిస్తోందన్నారు. ఈ మేరకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. ఈ అల్లర్లు ఆగాలంటే కుకీలకు ప్రత్యేక పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయడమే పరిష్కారమన్నారు. అసెంబ్లీకి వెళ్లాలంటేనే తనకు భయంగా ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు.