LOADING...
USA Visa: అమెరికా వీసా నిబంధనలు కఠినతరం.. . తక్షణమే అమల్లోకి..!
అమెరికా వీసా నిబంధనలు కఠినతరం.. . తక్షణమే అమల్లోకి..!

USA Visa: అమెరికా వీసా నిబంధనలు కఠినతరం.. . తక్షణమే అమల్లోకి..!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2025
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా (USA) వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు మరో చేదువార్త వెలువడింది. అమెరికా ప్రభుత్వం నాన్‌-ఇమిగ్రెంట్‌ వీసా (Non-Immigrant Visa - NIV) దరఖాస్తుదారులు వారి స్వదేశంలో లేదా చట్టబద్ధంగా నివాసం ఉన్న ప్రదేశాల్లోనే వీసా ఇంటర్వ్యూలను షెడ్యూల్‌ చేసుకోవాలని కొత్తగా ఆదేశించింది. ప్రస్తుతం ఇంటర్వ్యూలు నిర్వహించని ప్రదేశాల్లో ఉన్నవారినే కొంత మినహాయింపు ఇచ్చింది. ఈ నిబంధన వల్ల భారతీయ వ్యాపారులు,పర్యాటకులు ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. బీ1 (B1 - వ్యాపార వీసా),బీ2 (B2 - పర్యాటక వీసా) వీసాలను త్వరగా పొందడం కష్టతరంగా మారే అవకాశం ఉంది. గడచిన కాలంలో విదేశాల్లో వీసా అపాయింట్‌మెంట్లను బుక్‌ చేసుకోవడం సాధ్యం కాగా,ఇప్పుడు కొత్త నిబంధనల కారణంగా అది వీలయ్యే పరిస్థితి లేదు.

వివరాలు 

తాజా నిబంధన తక్షణమే అమల్లోకి

కోవిడ్‌-19 సమయంలో కూడా వీసా ప్రక్రియలో భారీ జాప్యం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే సమస్య మళ్లీ ఎదురవ్వకనే లేదని భావిస్తున్నారు. నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాలను సాధారణంగా వ్యాపార, పర్యాటక ప్రయాణం, విద్యాభ్యాసం, తాత్కాలిక ఉద్యోగాలు, అమెరికా పౌరులతో పెళ్లి చేసుకోవడం వంటి ఉద్దేశ్యాలకు ఇస్తారు. ఈ తాజా నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని అమెరికా విదేశాంగ శాఖ శనివారం ప్రకటించింది. అందువల్ల దరఖాస్తుదారులు తమ స్వదేశంలోనే వీసా అపాయింట్‌మెంట్‌ను షెడ్యూల్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది.

వివరాలు 

హెచ్‌-1బీ వీసాదారుల ఇంటర్వ్యూల కోసం బ్రెజిల్‌,థాయిల్యాండ్‌

ప్రస్తుతం భారత్‌లో హైదరాబాద్,ముంబయిలో బీ1, బీ2 వీసాల ఇంటర్వ్యూల కోసం సగటున మూడున్నర నెలల సమయం పడుతోంది. దిల్లీలో నాలుగు నెలలు,కోల్‌కత్తాలో ఐదు నెలలు,చెన్నైలో తొమ్మిది నెలల సమయం పడుతోంది. ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్న ప్రకారం,భారతీయులు వీటికి ప్రత్యామ్నాయంగా జర్మనీ,సింగపూర్‌, బ్యాంకాక్ వంటి దేశాల్లో ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఫ్రాంక్‌ఫర్ట్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం ప్రత్యేకంగా భారతీయులకు వీసా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. హెచ్‌-1బీ వీసాదారులు తమ ఇంటర్వ్యూల కోసం బ్రెజిల్‌,థాయిల్యాండ్‌లకు కూడా వెళ్లారు. ఈ పరిస్థితుల కారణంగా చాలామంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లడం మాని ఇతర దేశాలపై దృష్టిపెట్టారు. గత కొన్ని నెలలుగా అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది అని గణాంకాలు చెబుతున్నాయి.