Russian Oil: రష్యా ఆయిల్‌కు ఇచ్చిన మినహాయింపులపై అమెరికా యూటర్న్..!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గతంలో రష్యా చమురుపై విధించిన ఆంక్షల్లో ఇచ్చిన మినహాయింపులను ఇక కొనసాగించకూడదని అమెరికా భావిస్తోంది. దీంతో రష్యా చమురుపై మళ్లీ పూర్తి స్థాయి ఆంక్షలు అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. సెనెట్ విదేశీ సంబంధాల కమిటీ ఎదుట జరిగిన విచారణలో పాల్గొన్న రూబియోకు,రష్యా చమురుపై అమల్లో ఉన్న మినహాయింపులను మరోసారి పొడిగించే ఆలోచన ఉందా అని ఒక సెనెటర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన, ఆ మినహాయింపులను వీలైనంత త్వరగా ముగించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు.
వివరాలు
పరిస్థితులను బట్టి తుది నిర్ణయం
"ఈ మినహాయింపులను త్వరగా తొలగించాలనుకుంటున్నాం. రష్యా చమురుపై ఆంక్షలు విధించడమే అమెరికా ప్రధాన లక్ష్యం. అయితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు పరిమిత కాలానికి ఈ మినహాయింపులు ఇచ్చాం" అని రూబియో వివరించారు. అయితే అప్పటి పరిస్థితులను బట్టి తుది నిర్ణయం అమెరికా ట్రెజరీ శాఖ తీసుకుంటుందని స్పష్టం చేశారు.
వివరాలు
పెరిగిన అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు
ఇక పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అమెరికా మార్చిలో రష్యా ముడి చమురుపై కొన్ని మినహాయింపులు ప్రకటించింది. అనంతరం వాటిని రెండుసార్లు పొడిగించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న మినహాయింపుల గడువు ఈ నెల 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటిని మరోసారి పొడిగించకుండా, రష్యాపై కఠిన ఆంక్షలను తిరిగి అమలు చేసే దిశగా అమెరికా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.