Vardhman: వర్ధమాన్ గ్రూప్ సీఈవో ఎస్పీ ఓస్వాల్‌ను మోసం చేసిన కేటుగాళ్లు.. ఇద్దరు అరెస్ట్
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ సరికొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ కేటుగాళ్లు వివిధ రూపాల్లో మోసానికి పాల్పడి వందల నుంచి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. కష్టపడి సంపాదించిన సంపదను కాపాడుకోవడం చాలా ముఖ్యం, అయితే సైబర్ నేరాల పెరుగుదల కారణంగా ఇది కష్టంగా మారుతోంది. నేరగాళ్లు సామాన్య ప్రజలనే కాకుండా ప్రముఖులను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా, ప్రముఖ పారిశ్రామికవేత్త, వర్ధమాన్ గ్రూప్ యజమాని ఎస్పీ ఓస్వాల్ సైబర్ మోసానికి గురయ్యారు. ఓ అంతర్-రాష్ట్ర సైబర్ ముఠా వర్ధమాన్ గ్రూప్ సీఈవో శ్రీ పాల్ ఓస్వాల్‌ను రూ. 7 కోట్ల మేర మోసం చేసింది. వీరిని పంజాబ్ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు.
48 గంటల్లో కేసును ఛేదించారు
లూధియానా పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ ప్రకారం,ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 5.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని మరో ఏడుగురిని గుర్తించామని,వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, వీరంతా అస్సాం, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారని తెలిపారు. ఈ సైబర్ మోసం ఎలా జరిగింది అంటే, నిందితులు పారిశ్రామికవేత్తకు నకిలీ సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకొని,వాడిన బోగస్ అరెస్ట్ వారెంట్లతో బెదిరించి, డిజిటల్ రూపంలో అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. ఓస్వాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, సైబర్ సెల్ పోలీసులు చర్యలు తీసుకుని 48 గంటల్లో కేసును ఛేదించారు. నిందితులైన అటానూ చౌదరి, ఆనంద్ కుమార్ చౌదరి అనే ఇద్దరు అస్సాంలోని గౌహటి నివాసితులని గుర్తించారు.