Gold and Silver prices: భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో పసిడి ధరలు క్షీణిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో నమోదవుతున్న తక్కువ రేట్ల ప్రభావంతో దేశీయ బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1.25 లక్షలకు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1.14 లక్షల వద్ద కొనసాగింది. వెండి ధర కూడా కిలోకు దాదాపు రూ.1.56 లక్షలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి బంగారం ధరలు తరచూ మారుతుంటాయి. ఈ నెల 13వ తేదీకి 10 గ్రాముల బంగారం ధర రూ.1.30 లక్షల వరకు ఉండేది. అంటే కేవలం ఐదు రోజుల్లోనే సుమారు రూ.5 వేల మేర తగ్గింది.
వివరాలు
వెండి ప్రస్తుతం ఔన్స్ 49 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది
అప్పట్లో వెండి ధర కిలోకు రూ.1.70 లక్షలు ఉండగా, ప్రస్తుతం దాదాపు రూ.15 వేలు పడిపోయింది. ఆ సమయంలో అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర 4,200 డాలర్లుగా ఉండగా ఇప్పుడు సుమారు 4,010 డాలర్లకు చేరింది. వెండి ప్రస్తుతం ఔన్స్ 49 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ మార్పుల దెబ్బతో దేశీయ మార్కెట్‌లోనూ ధరలు క్షీణించాయి. సాధారణంగా అమెరికా వడ్డీ రేట్లకు, బంగారం ధరలకు విలోమ సంబంధం ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే బంగారం ధరలు తగ్గుతాయి; తగ్గిస్తే పెరుగుతాయి. ప్రస్తుతం అమెరికా డాలర్ బలపడటంతో పాటు, వచ్చే నెల ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు తగ్గిపోవడం వల్ల పసిడిపై డిమాండ్ తగ్గిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
వచ్చే నెలలో మరోమారు వడ్డీ రేట్లలో కోత అంచనా
అంతేకాక, డాలర్ ఇండెక్స్ బలపడటం కూడా మరో ప్రభావిత అంశమని వారు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ముగిసిన నేపథ్యంలో ఈ వారం ముఖ్య ఆర్థిక డేటా విడుదల కానుంది. ఫెడ్ గత సమావేశానికి సంబంధించిన వివరాలు, అలాగే సెప్టెంబర్ నెల ఉద్యోగాల గణాంకాలు బుధ, గురువారాల్లో బయటకు రానున్నాయి. ఈ డేటా ఫెడ్ భవిష్యత్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలతో పాటు, బంగారం ధరల దిశను కూడా ప్రభావితం చేయవచ్చు. ముందు నెలలో మరోసారి వడ్డీ రేట్లు తగ్గుతాయని మొదట అంచనాలున్నప్పటికీ, తాజా పరిస్థితుల్లో ఫెడ్ అధికారులు ఆ అవకాశాన్ని స్పష్టంగా ఖండిస్తున్నారు.