
iPhone Prices : ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. ఐఫోన్లు మరింత ఖరీదైనవి అవుతాయా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్ యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతూ వస్తోంది. ప్రారంభంలో 25 శాతం సుంకంతో మొదలైన ఈ చర్యలు ఇప్పుడు 50 శాతం వరకు చేరుకున్నాయి. ఇది భారత్ నుంచి జరుగుతున్న అనేక ఎగుమతులపై ప్రభావం చూపనుందని అంచనా. అయితే, ఈ టారిఫ్ పెంపు నిర్ణయాలు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఆపిల్ ఐఫోన్‌లపై ప్రభావం చూపవు. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే - ట్రంప్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో తీసుకున్న ఒక కీలక నిర్ణయం మేరకు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సుంకాల నుంచి మినహాయించారు.
వివరాలు
భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తి మున్ముందు మరింత పెరిగే అవకాశం
ప్రస్తుతం భారత్ ఐఫోన్ తయారీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉంది. అంతేకాదు, భారత్ ఇప్పటికే చైనాను దాటి అమెరికా మార్కెట్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. చైనాను తొలగిస్తూ ఆపిల్ కంపెనీ భారతీయ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. దీనివల్ల భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తి మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా వాణిజ్య విభాగం, దేశ భద్రతకు అవసరమైన రంగాలపై ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్ సెక్షన్ 232 కింద విశ్లేషణ చేపట్టింది. ఇందులో సెమీకండక్టర్లు వంటి కీలక అంశాల పరిశీలన జరుగుతోంది. ఇది పూర్తయ్యే వరకు భారత్ నుంచి ఎగుమతయ్యే ఐఫోన్‌లపై ప్రత్యేక సుంకాలు అమలులోకి వచ్చే అవకాశములేవు.
వివరాలు
భారత్ నుంచి ఐఫోన్ ఎగుమతులకు టారిఫ్ ఉంటుందా?
భారత్ నుంచి జరిగే ఐఫోన్ ఎగుమతులు టారిఫ్ కేటగిరీకి వస్తే, అది ఆపిల్ కంపెనీకి కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. ఎగుమతులు కొనసాగిస్తే, ఆపిల్ కంపెనీకి లాభాల పరంగా రాజీ పడాల్సి వస్తుంది. లేకపోతే అమెరికాలో ఐఫోన్ల ధరలు భారీగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇది అక్కడి వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఇక భారత్‌కు సంబంధించి చూస్తే, ఆపిల్‌కు సంబంధించిన ఎగుమతులు 40%-50% మేర తగ్గే అవకాశముంది. ఇది జరిగితే, వచ్చే సెప్టెంబర్‌లో రాబోయే ఐఫోన్ 17 సిరీస్ ధరలు మరియు అమ్మకాలపై గణనీయమైన ప్రభావం ఉండొచ్చు. ట్రంప్ విధించిన ఈ సుంకాల నిర్ణయాలు భవిష్యత్‌లో ఆపిల్ ఇండియా ఎగుమతులపై ఎంతటి ప్రభావం చూపుతాయన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.
వివరాలు
ప్రత్యేక టారిఫ్ ప్రణాళిక - ఆపిల్ డివైజ్‌లకు ఊరట?
అసలు ట్రంప్ ప్రకటించిన ప్రకారం, ప్రస్తుతం ఉన్న 25 శాతం సుంకాన్ని 50 శాతానికి పెంచబోతున్నారు. అయితే ఈ పెంపు అమల్లోకి రావడానికి ఇంకా 21 రోజులు సమయం ఉంది. అప్పటివరకు మాత్రం 25 శాతమే వర్తించనుంది. దీంతో, "ఐఫోన్ ధరలు పెరిగేనా?" అనే సందేహాలు వినిపిస్తున్నాయి. ఆపిల్ డివైజ్‌లను ఒక ప్రత్యేక టారిఫ్ ఫ్రేమ్‌వర్క్ కిందకి తీసుకురావాలని అమెరికా యోచిస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అంటే, ట్రంప్ పెంచిన ఈ సుంకాల పరిధిలోకి ఐఫోన్లు రావడం లేదన్న మాట.
వివరాలు
ఐఫోన్ 17 లాంచ్ ఎప్పుడు?
తాజా సమాచారం ప్రకారం, ఐఫోన్ 17 సిరీస్‌ను ఆపిల్ కంపెనీ సెప్టెంబర్‌లో విడుదల చేయనుంది. అందులో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ లాంచ్ చేయనున్నారు. వీటి విడుదల తేదీగా 2025 సెప్టెంబర్ 9 అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆపిల్ సంస్థ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.