LOADING...
RBI Governor: ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వస్తాయా? ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వస్తాయా? ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

RBI Governor: ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వస్తాయా? ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2026
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో త్వరలోనే పాలిమర్‌ (ప్లాస్టిక్‌) కరెన్సీ నోట్లు చలామణిలోకి రానున్నాయంటూ ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ప్లాస్టిక్ నోట్ల ప్రవేశంపై ఆలోచన జరుగుతున్న విషయం నిజమేనని, అయితే ప్రస్తుతం అది ప్రాథమిక పరిశీలన దశలో మాత్రమే ఉందని ఆయన వెల్లడించారు. దేశంలో నగదు వినియోగం అధికంగా ఉండటంతో కాగితపు కరెన్సీ ముద్రణ, నిర్వహణపై భారీ వ్యయం అవుతోంది. అంతేకాకుండా పేపర్ నోట్లు త్వరగా దెబ్బతిని చలామణికి అనర్హంగా మారడం వల్ల వాటిని తరచూ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో పాలిమర్ నోట్లను ప్రత్యామ్నాయంగా తీసుకురావచ్చా అనే అంశంపై ఆర్బీఐ అధ్యయనం నిర్వహిస్తోంది.

వివరాలు 

ప్లాస్టిక్ నోట్ల ప్రతిపాదన కొత్తది కాదు..

ప్లాస్టిక్ నోట్లు ఎక్కువకాలం మన్నికగా ఉండటంతో పాటు నిర్వహణ ఖర్చులను తగ్గించే అవకాశముందని భావిస్తున్నారు. అయితే వాటి అమలులో ఎదురయ్యే సాంకేతిక,నిర్వహణపరమైన సవాళ్లు ఏమిటి, భారత పరిస్థితులకు అవి ఎంతవరకు అనుకూలంగా ఉంటాయనే అంశాలను ఆర్బీఐ నిపుణులు పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ప్లాస్టిక్ నోట్ల ప్రతిపాదన కొత్తది కాదు. 2014 ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై పార్లమెంటుకు సమాచారం ఇచ్చింది. దేశంలోని భిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్లో వాటి పనితీరును అంచనా వేసేందుకు కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్ నగరాలను ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా రూ.100 కోట్ల విలువైన ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టాలని అప్పట్లో నిర్ణయించారు.

వివరాలు 

పాలిమర్ కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలపై మళ్లీ చర్చ

అయితే కొన్ని సాంకేతిక, నిర్వహణ సంబంధిత సమస్యల కారణంగా ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దీంతో ప్లాస్టిక్ నోట్ల ప్రయోగం మధ్యలోనే నిలిచిపోయింది. ప్రస్తుతం ఆర్బీఐ మరోసారి ఈ ప్రతిపాదనను పరిశీలిస్తుండటంతో, భవిష్యత్తులో దేశంలో పాలిమర్ కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలపై మళ్లీ చర్చ మొదలైంది.

Advertisement