ఏఐ రంగంలోకి విప్రో, బిలియన్ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. టీసీఎస్ బాటలో పయనం
ప్రముఖ టెక్ కంపెనీ విప్రో సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఏఐ 360ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వ్యాపారాల్లో కృత్రిమ మేధస్సు వంటి అత్యాధునిక సాంకేతికతకు ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో ఐటీ కంపెనీలు సైతం పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రానున్న 3 ఏళ్లలో కృత్రిమ మేధస్సు రంగం (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)రంగంలో దాదాపు ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇటీవలే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఏఐ సాంకేతికలపై పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది.టీసీఎస్ నుంచి ప్రకటన వచ్చిన వారం రోజులకే విప్రో తాజా ప్రకటన రావటం విశేషం. కృత్రిమ మేధస్సు, వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. ఏఐ ఆవిర్భావంతో అన్ని రంగాల్లోనూ వ్యవస్థీకృత మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
2.5 లక్షల మంది ఉద్యోగులకు స్పెషల్ ట్రైనింగ్ : విప్రో
ఏఐ టెక్నిక్స్ కారణంగా కొత్త వ్యాపార విధానాలు, సరికొత్త పని మార్గాలు, కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. అయినప్పటికీ తాము స్వీకరిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. తమ సంస్థను కృత్రిమ మేధ మరింత శక్తిమంతంగా తయారు చేస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. మెరుగైన కార్యకలాపాల నిర్వహణకు, క్లయింట్‌ల పరిష్కార మార్గాల్లో ఇది సహకరిస్తుందని వివరించింది. ఏఐ ఆధారిత భవిష్యత్ కోసమే తాము ఎదురుచూస్తున్నట్లు కంపెనీ సీఈఓ, ఎండీ థియరీ డెలాపోర్టే వెల్లడించారు. రానున్న 12 నెలల్లో ఏఐని సమర్థంగా వాడుకునేలా 2.5 లక్షల మంది ఉద్యోగులకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. ఇటీవలే టాటా సైతం 25 వేల మంది నిపుణులకు జెనరేటీవ్ ఏఐ టూల్స్‌పై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపింది.