Loading...
Wipro onboarding delay: విప్రో ఆఫర్ లెటర్లు ఇచ్చి ఆన్‌బోర్డింగ్ చేయలేదా? కేంద్రానికి నైట్స్ ఫిర్యాదు
విప్రో ఆఫర్ లెటర్లు ఇచ్చి ఆన్‌బోర్డింగ్ చేయలేదా?కేంద్రానికి నైట్స్ ఫిర్యాదు

Wipro onboarding delay: విప్రో ఆఫర్ లెటర్లు ఇచ్చి ఆన్‌బోర్డింగ్ చేయలేదా? కేంద్రానికి నైట్స్ ఫిర్యాదు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2026
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు భారతదేశంలో ఐటీ ఉద్యోగానికి ఎంతో గౌరవం ఉండేది. సాఫ్ట్‌వేర్ లేదా ఐటీ ఉద్యోగం వచ్చిందంటే జీవితంలో స్థిరపడినట్టేననే భావన ఉండేది. ముఖ్యంగా తమ కుమార్తెలను ఐటీ ఉద్యోగాలు చేసే యువకులకే ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించేవారు. అయితే గత కొంతకాలంగా ఐటీ రంగంలో పరిస్థితులు గణనీయంగా మారిపోయాయి. పెరిగిన ఖర్చులు, తగ్గుతున్న కాంట్రాక్టులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం వంటి అనేక కారణాలు ఐటీ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. సంప్రదాయ ఐటీ సేవలకు ఏఐ నుంచి ముప్పు పెరుగుతోందన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. దీంతో ఖర్చులను నియంత్రించుకునే క్రమంలో టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా పలు ప్రముఖ ఐటీ సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం, కొత్త నియామకాలను పరిమితం చేయడం వంటివి చేపట్టాయి.

వివరాలు 

ఫ్రెషర్ల నియామకాల్లో భారీ మార్పులు

గత రెండుమూడేళ్లుగా ఐటీ రంగంలో ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయి.

గతంలో మాదిరిగా కంపెనీలు కాలేజీ క్యాంపస్‌లకు వెళ్లి పెద్ద సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకోవడం గణనీయంగా తగ్గిపోయింది.

అయితే కొన్ని సంస్థలు విద్యార్థులను ఎంపిక చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చిన తర్వాత కూడా వారిని ఉద్యోగాల్లోకి తీసుకోకపోవడంతో వివాదాలు తలెత్తాయి.

ఇలాంటి ఆరోపణలు ఇన్ఫోసిస్‌పైనా గతంలో వచ్చాయి.

ఆఫర్ లెటర్లు అందుకున్న అభ్యర్థులు చాలా కాలం పాటు ఉద్యోగాల్లో చేరేందుకు ఎదురుచూడాల్సి వచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

చివరకు కంపెనీ వారిని ఆన్‌బోర్డింగ్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఇదే తరహా ఆరోపణలు మరో ప్రముఖ ఐటీ సంస్థ విప్రోపై వచ్చాయి.

వివరాలు 

విప్రో ఎలైట్ హైరింగ్‌పై ఆరోపణలు

భారతదేశంలోని టాప్-5 ఐటీ సంస్థల్లో ఒకటైన విప్రో.. ఎలైట్ హైరింగ్ 2025 కార్యక్రమం కింద 200 మందికిపైగా విద్యార్థులు, యువ ఇంజినీర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

అయితే వారికి ఆఫర్ లెటర్లు అందించినప్పటికీ ఇప్పటివరకు ఆన్‌బోర్డింగ్ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంపై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నైట్స్ (NITES - Nascent Information Technology Employees Senate) కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది.

గురువారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసిన నైట్స్.. ఈ అంశంలో జోక్యం చేసుకుని అభ్యర్థుల సమస్యను పరిష్కరించాలని కోరింది.

ADVERTISEMENT

వివరాలు 

ఫిబ్రవరిలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్

నైట్స్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలుజా తెలిపిన వివరాల ప్రకారం.. విప్రో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ 2025 ఫిబ్రవరి 1న జరిగినట్లు తెలుస్తోంది.

ఇందులో పాల్గొన్న అభ్యర్థులు టెక్నికల్, వాయిస్ అసెస్‌మెంట్ వంటి వివిధ పరీక్షలను పూర్తి చేసి అర్హత సాధించారు.

2025 జులైలో ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం.

అనంతరం 200 మందికిపైగా అభ్యర్థులకు జులై-ఆగస్టు మధ్యకాలంలో విప్రో ఆఫర్ లెటర్లు జారీ చేసినట్లు నైట్స్ పేర్కొంది.

అయితే ఆఫర్ లెటర్లు అందుకున్నప్పటికీ ఇప్పటివరకు వారికి ఉద్యోగాల్లో చేరే అవకాశం కల్పించలేదని ఆరోపించింది.

ADVERTISEMENT

వివరాలు 

కేంద్రం జోక్యం చేసుకోవాలని నైట్స్ విజ్ఞప్తి

ఎంపిక ప్రక్రియ పూర్తయి, ఆఫర్ లెటర్లు కూడా అందుకున్న తర్వాత ఇంత సుదీర్ఘకాలం అభ్యర్థులను ఎదురుచూడాల్సి రావడం ఆందోళనకరమని నైట్స్ తెలిపింది.

సరైన వివరణ ఇవ్వకుండా ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులు, యువ ఇంజినీర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

ముఖ్యంగా ఆర్థికంగా, మానసికంగా, వృత్తిపరంగా అభ్యర్థులపై ఈ ఆలస్యం ప్రభావం చూపుతోందని నైట్స్ తెలిపింది.

అందువల్ల కేంద్ర కార్మిక శాఖ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరింది.

వివరాలు 

ఐటీ ఉద్యోగుల సమస్యలపై నైట్స్

ఐటీ రంగంలో ఉద్యోగుల లేఆఫ్స్‌తో పాటు ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలపై నైట్స్ తరచూ తన గళాన్ని వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో విప్రో ఆన్‌బోర్డింగ్ ఆలస్యంపై కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది.

అయితే ఈ ఆరోపణలపై విప్రో నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రావాల్సి ఉంది.

ఆఫర్ లెటర్లు అందుకున్న అభ్యర్థులను ఎప్పుడు ఆన్‌బోర్డింగ్ చేస్తుంది? ఆలస్యానికి కారణమేంటి? అనే అంశాలపై కంపెనీ వివరణ ఇవ్వాల్సి ఉంది.

ADVERTISEMENT