Rupee vs Dollar: ట్రంప్ గెలుపుతో రూపాయి పతనం.. మరో 10శాతం దిగజారే అవకాశం
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతోంది. ఆరు సంవత్సరాల క్రితం రూపాయి విలువ 63 ఉండగా, 2024 నవంబర్ 12 నాటికి అది 84.45 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత డాలర్ విలువ పెరిగినందున, రూపాయి మరింత దిగజారింది. ఎస్‌బీఐ రీసెర్చ్ ప్రకారం, ట్రంప్ 2.0 పాలనలో రూపాయి విలువ మరో 8-10% వరకు క్షీణించే అవకాశం ఉంది. ట్రంప్ మొదటి అధ్యక్ష కాలంలో కూడా రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 11% పడిపోయింది. ఈసారి కూడా అదే ప్రభావం కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ట్రంప్ గెలుపుతో లాభాాల్లో అమెరికన్ స్టాక్ మార్కెట్లు
ట్రంప్ గెలిచిన తర్వాత అమెరికన్ స్టాక్ మార్కెట్ లాభాలు నమోదు చేస్తున్నాయి. ప్రధాన క్రిప్టో కరెన్సీ కూడా నూతన గరిష్ట స్థాయిని తాకింది. ట్రంప్ పాలనలో అమెరికా దిగుమతులపై సుంకాలు పెరగడం, H-1B వీసాలపై ఆంక్షలు విధించడం, డాలర్ బలపడటానికి చర్యలు తీసుకోవడం భారత ఆర్థిక వ్యవస్థకు ఒడుదొడుకులను తేవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ స్పష్టం చేసింంది. ట్రంప్ వ్యతిరేక చైనా విధానాలు, దీర్ఘకాలికంగా భారత్ తయారీ రంగం, ఎగుమతుల పెరుగుదలపై సానుకూల ప్రభావం చూపొచ్చు. ఇక కరెన్సీ మార్పిడి, ఎగుమతులు, దిగుమతులు, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు, విదేశీ మారక నిల్వలు, స్టాక్ మార్కెట్ సంక్షోభాలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ స్థాయి అనిశ్చితి వంటి అంశాలు కూడా రూపాయి విలువపై ప్రభావం చూపనున్నాయి.