2023లో తూర్పు ఆసియా వృద్ధి అంచనాలను తగ్గించిన ప్రపంచ బ్యాంకు
తూర్పు ఆసియా, పసిఫిక్‌లోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ తాజాగా సవరించింది. కఠినమైన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచబ్యాంకు ఈ సవరణలు చేసింది. తూర్పు ఆసియా జీడీపీ 2023లో 5శాతం ఉండగా, అది 2024లో 4.5శాతానికి పరిమితం అవుతుందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. 2023 ఏప్రిల్‌లో వృద్ధి రేటు 5.1శాతం ఉండగా, అది 2024 ఏప్రిల్ నాటికి 4.8శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. అయితే ఈ ప్రాంత వృద్ధి రేటు ఇప్పటికీ అన్ని ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లు కంటే ఎక్కువ కావడం గమనార్హం.
చైనా వృద్ధి రేటును తగ్గింపు
ప్రపంచ బ్యాంకు ప్రకారం 2023కి చైనా జీడీపీ వృద్ధి అంచనా 5.1% వద్ద స్థిరంగా ఉంది. అయితే 2024 ఏప్రిల్ నాటికి చైనా వృద్ధి రేటును ప్రపంచ బ్యాంకు మొదట 4.8శాతంగా అంచనా వేసింది. కానీ ఇప్పుడు అది 4.4శాతానికి తగ్గించబడింది. ఈ తగ్గుదలకు చైనాలో కొనసాగుతున్న దేశీయ సవాళ్లు, అధిక రుణ స్థాయిలు, ఇబ్బంది పడుతున్న ప్రాపర్టీ సెక్టార్, వృద్ధాప్య జనాభా వంటి నిర్మాణాత్మక అంశాలు కారణంగా ఉన్నాయి. మితమైన వృద్ధి ఉన్నప్పటికీ, తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత చైతన్యవంతమైన ప్రాంతాలలో ఒకటిగా ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
సంస్కరణలు అవసరం: ప్రపంచ బ్యాంకు
2023లో పసిఫిక్ ద్వీప దేశాలు 5.2% వృద్ధిని చూడగలవని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. ఇందులో చైనా మినహా ప్రాంతం 4.6% వృద్ధిని సాధించనున్నట్లు పేర్కొంది. 2024లో చైనాను మినహాయించి తూర్పు ఆసియా, పసిఫిక్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం, ఈ ప్రాంతంలోని తయారు చేసిన వస్తువులకు విదేశీ డిమాండ్ పెరగడం వల్ల 2024లో ప్రపంచ బ్యాంకు కొంచెం వేగవంతమైన వృద్ధి రేటును అంచనా వేసింది. అధిక వృద్ధిని కొనసాగించడానికి పారిశ్రామిక పోటీతత్వాన్ని కాపాడుకోవడానికి, వ్యాపార భాగస్వాములను వైవిధ్యపరచడానికి, ఉత్పాదకత పెంపుదల, ఉద్యోగ కల్పన కోసం సేవల రంగం సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి సంస్కరణలు అవసరమని ప్రపంచబ్యాంకు పేర్కొంది.