LOADING...
Zepto: అదనపు ఛార్జీల వివాదం..'అది మేం చేసిన పెద్ద తప్పు'.. అంగీకరించిన జెప్టో సీఈవో ఆదిత్‌ 
అంగీకరించిన జెప్టో సీఈవో ఆదిత్

Zepto: అదనపు ఛార్జీల వివాదం..'అది మేం చేసిన పెద్ద తప్పు'.. అంగీకరించిన జెప్టో సీఈవో ఆదిత్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్విక్‌కామర్స్‌ సంస్థ జప్టో ధరల నిర్ణయాల్లో కొన్ని లోపాలు జరిగాయని ఆ కంపెనీ సీఈవో ఆదిత్ పలిచా అంగీకరించారు. 'డార్క్ ప్యాటర్న్స్'గా పిలవబడే కొన్ని వ్యూహాలను ఉపయోగించడం తమ వైపు జరిగిన తప్పేనని ఆయన ఒక ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. ఆ కారణంగానే ఆ విధానాలను వెంటనే పూర్తిగా నిలిపివేశామని తెలిపారు. జెప్టోలో ధరలపై అమలు చేసిన కొన్ని ప్రయోగాలు సోషల్ మీడియాలో వినియోగదారుల నుంచి తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొన్నాయని ఆదిత్ చెప్పారు. వినియోగదారుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆ చర్యలను వెంటనే ఆపేసామని, ఇలాంటి పొరపాటు మళ్లీ జరగనివ్వమని హామీ ఇచ్చారు. అలాగే, ఈ విషయం గురించి ఏ నియంత్రణ సంస్థ నుంచి ఒత్తిడి రాలేదని, తామే స్వచ్ఛందంగా ఆ ప్రాక్టీసులను విరమించుకున్నామని చెప్పారు.

వివరాలు 

డార్క్ ప్యాటర్న్స్ అంటే ఏమిటి? 

కస్టమర్ల నమ్మకం దెబ్బతినకుండా ఉండటమే తమ ప్రధాన ఉద్దేశ్యమని ఆయన వివరణ ఇచ్చారు. డార్క్ ప్యాటర్న్స్ అంటే యూజర్‌కు తెలియకుండా అదనపు ఛార్జీలు జోడించే మోసపూరిత విధానాలు. ప్లాట్‌ఫామ్ ఇంటర్‌ఫేస్‌లో ముందుగా కనిపించకుండా, ఆర్డర్ చివరి దశ.. చెక్‌ఔట్ సమయంలో.. ఈ ఫీజులు చూపించబడతాయి. 'రెయిన్ ఫీజు', 'క్యాష్ హ్యాండ్లింగ్ ఫీజు', 'ఐటెం హ్యాండ్లింగ్ ఛార్జీలు' వంటి పేర్లతో కస్టమర్‌ బిల్లులో చేర్చుతుంటారు. చాలా మంది వినియోగదారులు వస్తువుల ధరను చూసి వెంటనే కొనుగోలు ప్రక్రియ కొనసాగిస్తారు; మిగతా ఛార్జీలను పెద్దగా గమనించరు. ఈ అలవాటును ఉపయోగించుకుని కొన్ని ఈ-కామర్స్ సంస్థలు ఇలాంటి దారితప్పించే వ్యూహాలను అమలు చేస్తూ ఉంటాయి.