Zomato: జొమాటోలో 'వెజ్ మోడ్ ఫీ'పై నెటిజెన్ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన సీఈఓ
ఈ వార్తాకథనం ఏంటి
వెజిటేరియన్ ఆహార డెలివరీలకు ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో వెనక్కి తగ్గింది.
సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఈ సంస్థ ఆహార డెలివరీ కోసం అదనంగా తీసుకునే రుసుమును ఆపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ లింక్డిన్ వేదికగా వెల్లడించారు.
రోహిత్ రంజన్ అనే యూజర్ జొమాటోలో వెజిటేరియన్ ఫుడ్ డెలివరీపై "వెజ్ మోడ్ ఎనేబుల్‌మెంట్ ఫీ" పేరిట అధిక రుసుము వసూలు చేస్తున్న విషయాన్ని గమనించి, ఈ విషయాన్ని లింక్డిన్‌లో నెటిజన్లతో పంచుకున్నారు.
అదనపు ఛార్జీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన "దేశంలో శాకాహారిగా ఉండటం తప్పేంటి?" అని ప్రశ్నించారు.
వివరాలు
"ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్"గా ప్రచారం
జొమాటో ఈ రుసుమును "ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్"గా ప్రచారం చేస్తోందని విమర్శించారు.
అయితే, స్విగ్గీ సంస్థ శాకాహార డెలివరీలపై ఎటువంటి ఛార్జీలను వసూలు చేయడంలేదని చెప్పారు.
వెజిటేరియన్ ఆహార డెలివరీలకు సమానంగా చూసిన స్విగ్గీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ "వెజ్ మోడ్" ఫీజుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆయన పంచుకున్నారు.
ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.దీనిపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్పందించారు.
ఈ అంశం తమ దృష్టికి తీసుకురావడంపై ధన్యవాదాలు తెలియజేస్తూ,"తప్పు జరిగింది, క్షమించండి.
ఈ రోజు నుంచే ఈ రుసుము వసూలు చేయడాన్ని ఆపివేస్తున్నాం"అని తెలిపారు.
ఇలాంటి తప్పులు మరల జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని గోయల్ పేర్కొన్నారు.