బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డ రావణాసుర: నాలుగు రోజుల కలెక్షన్లే సాక్ష్యం
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రావణాసుర చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. థ్రిల్లర్ అంశాలతో సినిమాను నింపేసినప్పటికీ ప్రేక్షకులను థ్రిల్ చేయలేక బాక్సాఫీసు వద్ద తన ప్రభావాన్ని చూపించలేకపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో రావణాసుర కలెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయి. విడుదలైన రోజు నుండి ఇప్పటివరకు క్రమ తప్పకుండా తగ్గుతూనే వెళ్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటివరకు డేటా చూసుకుంటే 14కోట్ల 80లక్షల గ్రాస్ వసూళ్ళు సాధించింది. నెట్ చూసుకుంటే 8.82కోట్లుగా ఉంది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల ఆవల చూసుకుంటే, ఓవర్సీస్ లో 99లక్షలు, కర్ణాటక సహా ఇండియా మొత్తంలో 72లక్షలు సాధించినట్లు అర్థమవుతోంది.
ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోలేకపోతున్న రావణాసుర
రావణాసుర చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ 22.20కోట్లుగా ఉంది. అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ నంబర్ ను అందుకోవాలంటే ఇంకా 13కోట్ల నెట్ వసూళ్ళను సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రావణాసుర చిత్రానికి ఆ స్థాయి వసూళ్ళు రావడం కష్టమే అంటున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలో బాక్సాఫీసును షేక్ చేసిన రవితేజ, రావణాసుర సినిమాతో హ్యాట్రిక్ అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లేనని చెబుతున్నారు. ప్రస్తుతానికి బాక్సాఫీసు వద్ద ఇతర చిత్రాల తాకిడి పెద్దగా లేదు. సమంత నటించిన శాకుంతలం, రాఘవ లారెన్స్ నటించిన రుద్రుడు, వెట్రిమారన్ దర్శకత్వంలోని విడుదల సినిమాలు ఈవారం థియేటర్లలోకి రానున్నాయి. మరి అప్పటివరకు రావణాసుర చిత్రం ఎలాంటి వసూళ్ళు అందుకుంటుందో చూడాలి.