Ajith Kumar: అజిత్ కుమార్, మాధవన్ దుబాయ్‌లో సేఫ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పలు దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా కువైట్, ఖతార్, యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య అక్కడే ఉన్న సినీ నటులు అజిత్ కుమార్, ఆర్. మాధవన్ గురించి అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ వార్తలపై తాజాగా అజిత్ బృందం స్పందించింది. అజిత్ క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేసింది. మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కారణంగా ఇటీవల కాలంలో ఆయన ఎక్కువ సమయం దుబాయ్‌లో గడుపుతున్నారు. ఇటీవల చెన్నైకి తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ, దుబాయ్ గగనతలంపై ఆంక్షలు విధించడంతో అక్కడే ఉండాల్సి వచ్చిందని తెలిపారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తన ప్రణాళికల్లో మార్పులు చేసుకున్నారని మేనేజర్ వెల్లడించారు.
Details
అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక మాధవన్ కూడా తాను సురక్షితంగానే ఉన్నానని తెలియజేశారు. ప్రస్తుతం తాను దుబాయ్‌లో లేనని, కుటుంబంతో కలిసి అమెరికాలో ఉన్నట్లు మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా, దుబాయ్ గగనతలంలో ఇరాన్ క్షిపణుల దాడి దృశ్యాలను నటుడు మంచు విష్ణు 'ఎక్స్'లో షేర్ చేశారు. ఆ పేలుళ్లు తాము ఉన్న ఇంటిని కంపించాయని పేర్కొన్నారు. అలాగే పివి.సింధు కూడా స్పందిస్తూ, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన పేలుడు తమను తీవ్ర భయాందోళనకు గురి చేసిందని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.