ఉగ్రం టీజర్ టాక్: పవర్ పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేష్
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఉగ్రం టీజర్ ఈరోజే విడుదలైంది. అక్కినేని నాగ చైతన్య అతిధిగా టీజర్ లాంచ్ కార్యక్రమం సాగింది. ఉగ్రం టీజర్ చాలా కొత్తగా ఉంది. అల్లరి నరేష్ చెప్పినట్టుగానే, గతంలో ఎన్నడూ కనిపించని విధంగా కనిపించాడు. ఇప్పటివరకు అల్లరి నరేష్, కామెడీ పోలీస్ పాత్రల్లోనే కనిపించాడు. కానీ ఈసారి పవర్ ఫుల్ పాత్రలో అదరగొట్టాడు. పొడుగాటి మీసకట్టుతో, బలమైన శరీరంతో, కళ్ళల్లో గాంభీర్యంతో పోలీస్ ఆఫీసర్ గా సరిగ్గా సరిపోయాడు. డైలాగులు కూడా పవర్ ఫుల్ గా ఉన్నాయి. సినిమా పేరులానే టీజర్ లోని షాట్స్ అన్నీ ఉగ్రంగానే కనిపించాయి. సినిమాలోని కీ పాయింట్ ఫ్యామిలీ కావొచ్చని టీజర్ లాస్ట్ షాట్ ద్వారా అర్థమవుతోంది.
ఫ్యామిలీ కోసం విలన్ల వేట
టీజర్ లాస్ట్ లో, నా పాప మీద చెయ్యేస్తార్రా అన్న డైలాగ్ ఉంటుంది. దానికి తోడు, అల్లరి నరేష్ పాత్ర, తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్న షాట్స్ కొన్ని చూపించారు. ఇదంతా చూస్తుంటే తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి విలన్ల మీద పగ తీర్చుకునే రివేంజ్ డ్రామా కావొచ్చని అనిపిస్తోంది. ఈ విషయంలో స్పష్టత రావాలంటే ట్రైలర్ విడుదల కావాల్సిందే. అల్లరి నరేష్ సరసన మళయాలం భామ మిర్నా హీరోయిన్ గా కనిపిస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మే 5వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నారు.