అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో మొదలైన ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రత్యేకతలు
సినిమా థియేటర్ల దిగ్గజం ఏషియన్ సినిమాస్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సినిమా థియేటర్లు ఉన్న సంస్థ ఏషియన్ కావడం విశేషం. తాజాగా ఏషియన్ సినిమాస్ తో భాగస్వామ్యం కలుపుకుని ఏఏఏ సినిమాస్ పేరుతో మరో కొత్త మల్టీప్లెక్సును అల్లు అర్జున్ ప్రారంభించాడు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో నిర్మింపబడ్డ ఈ మల్టీప్లెక్సును ఈరోజు ఉదయం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించాడు. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ మల్టీప్లెక్సులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అమీర్ పేటలోని పాత సత్యం థియేటర్ స్థానంలో ఈ మల్టీప్లెక్సును నిర్మించారు. అందుకే ఈ మాల్ కు ఏషియన్ సత్యం మాల్ అని పిలుస్తున్నారు.
ఏఏఏ సినిమాస్ ప్రత్యేకతలు
ఏఏఏ సినిమాస్ ప్రారంభోత్సవానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ హాజరయ్యారు. ఏఏఏ సినిమాస్ లో 5స్క్రీన్లు ఉన్నాయి. అందులో 67అడుగుల ఎత్తులో అతిపెద్ద స్కీన్ ఉంది. ఈ స్క్రీన్ లో డాల్బీ అట్మాస్ సౌండ్, బార్కో లేజర్ టెక్నాలజీ ఉంది. రెండవ స్క్రీన్ లో ఈపీఐక్యూ లక్సన్ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్ సౌండ్ ఉంది. మిగతా స్క్రీన్స్ అన్నీ 4కే రిజల్యూషన్ తో ఉన్నాయి. రేపు విడుదలయ్యే ఆదిపురుష్ చిత్రంతో ఈ మల్టీప్లెక్సులో సినిమాల ప్రదర్శన మొదలు కానుంది. అదలా ఉంచితే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నాడు.