
AAA : విశాఖలో 'అల్లు అర్జున్' మల్టీప్లెక్స్.. ఏకంగా 8 స్క్రీన్లు!
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం లోని ఇనార్బిట్ మాల్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ మాల్ విశాఖ నగరానికి ఓ కొత్త ఆకర్షణగా మారనుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత విస్తీర్ణంతో నిర్మిస్తున్న మాల్‌గా విశాఖలో నిర్మాణం జరగడం విశేషం. ఇప్పటికే నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మాల్లో ఆసియన్ అల్లు అర్జున్ (AAA) మల్టీప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2023లో 13 ఎకరాల విస్తీర్ణంలో ఈ మాల్ నిర్మాణానికి పునాది వేయగా, ఇప్పుడు మల్టీప్లెక్స్ పనులు ప్రారంభమయ్యాయి. జూలై 10న ఆసియన్ గ్రూప్‌కి చెందిన సునీల్, అల్లు అరవింద్ సహా వారి బృందం విశాఖ చేరుకొని AAA మల్టీప్లెక్స్ పనులను ప్రారంభించారు.
Details
విదేశాల నుండి ఫర్నీచర్
వచ్చే పదినెలలలో పనులు పూర్తి చేసి, 2026 సమ్మర్‌లో మల్టీప్లెక్స్ ప్రారంభించాలన్నది వారి లక్ష్యం. ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం 8 స్క్రీన్లు ఉండనున్నాయి. విశాఖలో అత్యంత లగ్జరీ మల్టీప్లెక్స్‌గా ఇది రూపొందనుంది. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయి ఇంటీరియర్ డిజైనర్లను అల్లు అర్జున్ ఎంపిక చేశారని సమాచారం. థియేటర్లో అవసరమైన ఫర్నీచర్ కూడా ప్రత్యేకంగా విదేశాల నుండి తెప్పిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో AAA మల్టిప్లెక్స్ విజయవంతంగా నడుస్తుండగా, అదే స్థాయిలో విశాఖలోనూ AAA థియేటర్‌ను ఏర్పాటు చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్‌తోపాటు ఇనార్బిట్ మాల్ కూడా విశాఖ వాసులకు మెరుగైన షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాన్ని అందించనుంది.