Loading...
Vedula Suryanarayana Murthy: దేవిప్రియకు TFJA మరోసారి షాక్.. సినీ ఇంటర్వ్యూలు, ప్రమోషన్లపై నిషేధం
దేవిప్రియకు TFJA మరోసారి షాక్.. సినీ ఇంటర్వ్యూలు, ప్రమోషన్లపై నిషేధం

Vedula Suryanarayana Murthy: దేవిప్రియకు TFJA మరోసారి షాక్.. సినీ ఇంటర్వ్యూలు, ప్రమోషన్లపై నిషేధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ జర్నలిస్ట్ వేదుల సూర్యనారాయణ మూర్తి అలియాస్ దేవిప్రియ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న ఆయనపై తెలుగు సినీ పాత్రికేయ సంఘం (TFJA) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దేవిప్రియకు సినీ ప్రముఖులు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, సినిమా ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇతర సినీ కార్యక్రమాలకు ఆహ్వానించకూడదని సూచించింది. ఈ మేరకు నవంబర్ 23న తెలుగు సినీ పరిశ్రమకు TFJA అధికారికంగా లేఖ విడుదల చేసింది. ఈ నిర్ణయం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది.

వివరాలు

ఇంటర్వ్యూలు, ప్రమోషన్లకు దూరంగా ఉంచాలని సూచన

తెలుగు సినీ జర్నలిస్టుల సంఘం ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. వేదుల మూర్తికి ఎలాంటి సినిమా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు.

అలాగే చిత్రాల ప్రచార కార్యక్రమాలు, సినిమా విడుదల వేడుకలు, ఇతర ప్రమోషనల్ ఈవెంట్లలో ఆయనకు భాగస్వామ్యం కల్పించవద్దని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, చిత్ర బృంద సభ్యులను TFJA కోరింది.

ఈ మేరకు అధికారిక నోటీసును జారీ చేసింది. TFJA అధ్యక్షుడు వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి పి. రఘు, పొలిట్‌బ్యూరో కన్వీనర్ వి. లక్ష్మీనారాయణ సంతకాలతో ఈ లేఖ విడుదలైంది.

సంఘం కార్యవర్గం తీసుకున్న నిర్ణయానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ సహకరించాలని అందులో విజ్ఞప్తి చేశారు.

వివరాలు

గతంలోనూ పలుమార్లు వివాదాలు

అయితే దేవిప్రియపై తాజాగా ఇలాంటి ఆంక్షలు విధించడానికి గల నిర్దిష్ట కారణాలను మాత్రం TFJA తన లేఖలో వెల్లడించలేదు.

దీంతో ఈ నిర్ణయం వెనుక ఉన్న పూర్తి కారణాలపై సినీ, మీడియా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. వేదుల మూర్తి అలియాస్ దేవిప్రియ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు.

గతంలోనూ ఆయన వృత్తిపరమైన వ్యవహారశైలి, సోషల్ మీడియా పోస్టులు, సినీ ప్రముఖులతో నిర్వహించిన ఇంటర్వ్యూల విషయంలో విమర్శలు, వివాదాలు ఎదుర్కొన్నారు.

2024 డిసెంబర్‌లో జ్యోతిష్యుడు వేణుస్వామితో నిర్వహించిన ఇంటర్వ్యూ వివాదం నేపథ్యంలో TFJA ఆయనపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ విధించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.

అనంతరం దేవిప్రియ క్షమాపణలు కోరడంతో తిరిగి సంఘంలోకి తీసుకున్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

ఇంటర్వ్యూల్లో ప్రశ్నలపైనా అభ్యంతరాలు

అలాగే 2026 మార్చిలో తోటి జర్నలిస్టులపై ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి ఆయనపై మూడు నెలల సస్పెన్షన్ వేటు పడింది.

మరోవైపు ఇంటర్వ్యూల్లో వ్యూస్ కోసం నటీనటులను ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతున్నారనే విమర్శలు కూడా గతంలో దేవిప్రియపై వచ్చాయి.

ముఖ్యంగా ద్వంద్వార్థాలు వచ్చేలా ప్రశ్నలు వేస్తున్నారంటూ కొందరు సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి.

గతంలో మంచు లక్ష్మితో నిర్వహించిన ఇంటర్వ్యూ కూడా వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తాజాగా TFJA తీసుకున్న నిర్ణయం టాలీవుడ్‌లో మరోసారి చర్చకు దారితీసింది.

ADVERTISEMENT