Loading...
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. 'గోంధళ్'తో పాటు 'అంగ్'కు కూడా అరుదైన ఛాన్స్
ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. 'గోంధళ్'తో పాటు 'అంగ్'కు కూడా అరుదైన ఛాన్స్

Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. 'గోంధళ్'తో పాటు 'అంగ్'కు కూడా అరుదైన ఛాన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2026
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్కార్ అవార్డుల విషయానికి వస్తే సాధారణంగా ఒక దేశం నుంచి అధికారికంగా ఒక్క సినిమా మాత్రమే ఎంపికవుతుందని మనకు తెలుసు. అయితే 2027 ఆస్కార్ రేసులో భారత్ విషయంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా మారింది. ఇప్పటికే మరాఠీ చిత్రం 'గోంధళ్' (Gondhal)ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఎంపిక చేయగా.. నాగాలాండ్‌కు చెందిన 'అంగ్' (Angh) కూడా మరో మార్గం ద్వారా ఆస్కార్ రేసులోకి ప్రవేశించింది. ఒకటి భారత్ అధికారిక ఎంట్రీగా నిలవగా.. మరొకటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సాధించిన అవార్డు ద్వారా ఆస్కార్‌కు అర్హత సాధించడం విశేషం. సాధారణంగా భారతదేశం తరఫున ఒకే ఒక్క సినిమా అధికారికంగా ఆస్కార్‌కు ఎంపికవుతుంది. ఆ హోదాను మరాఠీ చిత్రం 'గోంధళ్' దక్కించుకుంది.

వివరాలు

99వ ఆస్కార్ అవార్డుల రేసులో

అయితే నాగాలాండ్‌కు చెందిన విప్లవాత్మక నేపథ్యంతో తెరకెక్కిన 'అంగ్' సినిమా కొత్త అంతర్జాతీయ నిబంధనల ప్రకారం నేరుగా ఆస్కార్ బరిలోకి దిగే అరుదైన అవకాశాన్ని పొందింది.

దీంతో టెక్నికల్‌గా చూస్తే.. ఈ రెండు సినిమాలు వేర్వేరు మార్గాల ద్వారా 2027లో జరగనున్న 99వ ఆస్కార్ అవార్డుల రేసులో నిలిచాయి.

తద్వారా ప్రపంచ వేదికపై భారతీయ సినిమా సత్తాను చాటే అవకాశం దక్కించుకున్నాయి. ముందుగా 'గోంధళ్' విషయానికి వస్తే.. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ దేశవ్యాప్తంగా వచ్చిన 33 సినిమాలను పరిశీలించింది.

అనంతరం సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ఈ మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్‌ను 'ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్' కేటగిరీలో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.

వివరాలు

'గోంధళ్'పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి

మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో నూతన వధూవరుల జీవితాలు బాగుండాలని కోరుకుంటూ రాత్రంతా నిర్వహించే 'గోంధళ్' అనే జానపద దైవిక పూజ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.

ఈ ఆచారం వెనుక చోటుచేసుకునే ప్రమాదకరమైన ప్రేమ, మోసం, హత్యల కుట్ర చుట్టూ కథను ఆసక్తికరంగా తెరకెక్కించారు.

ఆస్కార్‌కు భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపిక కావడంతో 'గోంధళ్'పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి భారీగా పెరిగింది.

మరోవైపు తేజా రియో దర్శకత్వంలో తెరకెక్కిన నాగా కల్చరల్ పీరియడ్ డ్రామా 'అంగ్'కు ఇండియన్ జ్యూరీ రేసులో 'గోంధళ్'తో పోలిస్తే మరో రకమైన పరిస్థితి ఎదురైంది.

ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకపోవడంతో సాంకేతిక కారణాల వల్ల భారత అధికారిక ఎంట్రీ ఎంపిక ప్రక్రియలో ముందుకు వెళ్లలేకపోయింది.

ADVERTISEMENT

వివరాలు

సరికొత్త రికార్డును సృష్టించిన 'అంగ్'

అయితే 'అంగ్'కు అంతర్జాతీయ స్థాయిలో కీలక గుర్తింపు లభించింది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ఈ సినిమా అత్యున్నత 'ప్లాట్‌ఫామ్ ప్రైజ్'ను గెలుచుకుంది.

ఆస్కార్ అకాడమీ సరికొత్త నిబంధనల ప్రకారం.. ఎంపిక చేసిన కొన్ని అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రధాన అవార్డు గెలుచుకున్న సినిమాలు తమ దేశ అధికారిక ఆస్కార్ ఎంట్రీతో సంబంధం లేకుండా నేరుగా ఆస్కార్ రేసులోకి అర్హత సాధించే అవకాశం ఉంది.

ఈ నిబంధన ద్వారా 'అంగ్' కూడా స్వతంత్రంగా ఆస్కార్ బరిలోకి ప్రవేశించింది. తద్వారా ఈ సినిమా ఒక సరికొత్త రికార్డు సృష్టించింది.

అయితే 'గోంధళ్', 'అంగ్' సినిమాలు ఒకే విధంగా ఆస్కార్ రేసులోకి వెళ్లలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 'గోంధళ్' భారత్ అధికారిక ఆస్కార్ ఎంట్రీగా నిలిచింది.

ADVERTISEMENT

వివరాలు

భారతీయ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు

'అంగ్' మాత్రం టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సాధించిన ప్లాట్‌ఫామ్ ప్రైజ్ ఆధారంగా అకాడమీ కొత్త నిబంధనల ద్వారా నేరుగా రేసులోకి వచ్చింది.

ఆస్కార్ రేసులోకి అర్హత సాధించడం అంటే నామినేషన్ ఖరారైనట్లు కాదు. 'గోంధళ్', 'అంగ్' రెండూ ప్రస్తుతం ఆస్కార్ పరిశీలనలోకి వెళ్లేందుకు అర్హత సాధించాయి.

ఇక అకాడమీ నిర్వహించే తదుపరి ప్రక్రియలో షార్ట్‌లిస్ట్, నామినేషన్లు వంటి దశలు ఉంటాయి. మరి ఈ తదుపరి దశలన్నింటినీ దాటుకుని 2027 ఆస్కార్ వేడుకల్లో భారతీయ సినిమాలు నిలుస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది.

'గోంధళ్', 'అంగ్' చిత్రాలు ఆస్కార్‌లో తదుపరి దశలకు చేరుకుని భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తే.. అది ఇండియన్ సినీ ఇండస్ట్రీకి అరుదైన గౌరవంగా నిలిచే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT