
Madhav Raj Bhupathi: మాస్ మహారాజా రవితేజ కుటుంబం మరో హీరో ఎంట్రీ.. 'మారెమ్మ'తో సినీ రంగంలోకి మాధవ్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో వారసుల రాక కొనసాగుతోంది. తాజాగా మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి మరో యువ కథానాయకుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ రాజ్ భూపతి హీరోగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి 'మారెమ్మ' అనే ఆసక్తికర శీర్షికను ఖరారు చేశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే వినూత్న కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు నాగరాజ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్టు టీమ్ వెల్లడించింది.
Details
ఇవాళ సాయంత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. అలాగే ఆగస్టులో గ్లిమ్స్ విడుదల చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. మాధవ్ హీరోగా నటించిన మొదటి చిత్రం 'మిస్టర్ ఇడియట్'. అయితే, షూటింగ్ పూర్తయినప్పటికీ అనేక కారణాలతో ఆ చిత్రం విడుదల కాలేదు. దీంతో 'మారెమ్మ' చిత్రమే ఆయన డెబ్యూ ఫిల్మ్‌గా మారుతోంది. ఈ సినిమాను దసరా పండగ సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. పెదనాన్న రవితేజ స్ఫూర్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టిన మాధవ్... 'మారెమ్మ' చిత్రంతో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. ఇప్పటికే సినీ వర్గాల్లో ఈ సినిమాపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.