
Anurag Kashyap: 'ఫూలే' సినిమా వివాదం.. సెన్సార్ బోర్డ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అనురాగ్ కశ్యప్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నుండి విడుదల కానున్న "ఫూలే" అనే చిత్రం ఇప్పటికే వివాదాస్పదంగా మారింది.
ఏప్రిల్ 11న ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉండగా, బ్రాహ్మణ సమాజానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ చిత్రంలో తమ సామాజిక వర్గాన్ని తప్పుగా చిత్రీకరించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనివల్ల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాపై పలు మార్పులు చేయాలని ఆదేశించింది.
సెన్సార్ బోర్డు సూచించిన ప్రధాన మార్పులు ఏమిటంటే.."మాంగ్","మహర్","పేష్వాయి" వంటి పదాలను పూర్తిగా తీసేయాలని,అలాగే "3000 సంవత్సరాల గులామీ" అనే డైలాగ్‌ను "కొన్ని సంవత్సరాల గులామీ"గా మార్చాలని అన్నారు.
అయితే, ఈ మార్పులను చిత్ర దర్శకుడు అంగీకరించకపోవడంతో, కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
వివరాలు
అనురాగ్ కశ్యప్ ఘాటుగా స్పందించిన విధానం
సెన్సార్ బోర్డు కూడా, చిత్రం విడుదల కావాలంటే కుల సంబంధిత పదాలను తప్పనిసరిగా తొలగించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, "ఫూలే" చుట్టూ వివాదం ఇంకా కొనసాగుతోంది.
ఈ వివాదం మధ్య బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ, సెన్సార్ బోర్డుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల ద్వారా ఆయన .. "నా జీవితంలో నేను మొదటిసారి వేసిన నాటకం మహాత్మా జ్యోతిరావు ఫూలే,సావిత్రిబాయి ఫూలేల పైనే.ఈ దేశంలో కుల వ్యవస్థ లేకపోతే, వాళ్లు ఎందుకు పోరాడాల్సి వచ్చిందని?" అని ప్రశ్నించారు.
"ప్రస్తుతం బ్రాహ్మణులు సిగ్గుతో తలదించుకుంటున్నారా? లేక ఇంకెక్కడైనా మనం చూడలేని ఇంకో బ్రాహ్మణుడు ఉన్నాడా? అసలు మూర్ఖుడు ఎవరు?" అంటూ ఆగ్రహంగా రాశారు.
వివరాలు
సెన్సార్ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు
తర్వాతి పోస్ట్‌లో, అనురాగ్ కశ్యప్ సెన్సార్ బోర్డును పూర్తిగా మోసపూరిత వ్యవస్థగా అభివర్ణించారు.
"ఒక సినిమా సెన్సార్ బోర్డుకు వెళ్తే,అక్కడ నలుగురు సభ్యులు ఉంటారు.వారు సినిమా చూసిన తర్వాత దానిలోని అంశాలు బయటికి ఎలా వస్తున్నాయి?బయటి వ్యక్తులు ఎలా ముందే ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?"అని ఆయన ప్రశ్నించారు.
ఇది సెన్సార్ బోర్డు సభ్యులే వివరాలు బయటకు చెప్పినట్లేనని అనుమానం వ్యక్తం చేస్తూ.. "ఇది మొత్తం వ్యవస్థే మోసపూరితమైనదిగా మారింది" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో, కుల వ్యవస్థపై నిజంగా ప్రశ్నించే సినిమాలను ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వమే అడ్డుకుంటోందని ఆరోపించారు.
"వారు (ప్రభుత్వం) భయపడుతున్నారు, బహిరంగంగా చెప్పడానికి కూడా ధైర్యం లేదంటూ.. వారు పిరికివాళ్ళు" అని ఘాటు విమర్శలు చేశారు.
వివరాలు
మోడీ వ్యాఖ్యలపై ఆగ్రహం
తర్వాతి స్టోరీలో,సీబీఎఫ్‌సీపై మరింతగా మండిపడుతూ,అనురాగ్ కశ్యప్ ధడక్ 2 సినిమా సమయంలో సెన్సార్ బోర్డు వారికి.."భారతదేశంలో మోడీ కుల వ్యవస్థను తొలగించారని" చెప్పిందని వెల్లడించారు.
అదే సమయంలో 'సంతోష్' అనే మరో సినిమా కూడా ఇదే కారణంగా విడుదల కాలేదన్నారు.
ఇప్పుడు,బ్రాహ్మణులు 'ఫూలే' సినిమాను వ్యతిరేకిస్తుండటం పై.. "కుల వ్యవస్థ లేదంటే, మీరు బ్రాహ్మణులు ఎలా అవుతారు? మీరు ఎవరు? ఎందుకు అంతగా బాధపడుతున్నారు?" అని నిలదీశారు.
"జ్యోతిరావ్ ఫూలే,సావిత్రిబాయి ఫూలే కుల వ్యతిరేక పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది?" అని ప్రశ్నించారు.
"మోడీ చెప్పినట్లు కుల వ్యవస్థ లేకపోతే,బ్రాహ్మణత్వానికి ఉనికే లేదేమో...ప్రజలు మూర్ఖులు కాదని, నిజమైన బ్రాహ్మణులు ఎవరో, కుల ఆధిపత్యాన్ని వ్యాప్తి చేస్తున్నవారెవరో ఒకసారి తేల్చుకోండి" అని చివరగా హెచ్చరించారు.
వివరాలు
ఫూలే సినిమాలో నటిస్తున్న వారు - నిర్మాణ బృందం
ఈ చిత్రం విషయానికొస్తే, ప్రముఖ గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ జ్యోతిరావ్ ఫూలే పాత్రలో కనిపించనున్నాడు.
అతని భార్య సావిత్రిబాయి పాత్రలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు సతీమణి పత్రలేఖ నటిస్తున్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అనంత్ నారాయణ్ మహాదేవన్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రణయ్ చోక్షి, జగదీష్ పటేల్, రితేష్ కుదేచా, అనుయా చౌహాన్ కుదేచా, సునీల్ జైన్ తదితరులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.